- తడిసిన, మొలకెత్తిన వడ్లను కూడా మద్దతు ధరకు కొంటాం
- కొనుగోలు చేసిన 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు
- వరి వేస్తే ఉరి అన్న వ్యక్తికి మాకు చాలా తేడా ఉంది
- ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ నేతల అక్కసు
- స్వార్థం కోసం రైతులను ఆగం చేయొద్దని హితవు
హైదరాబాద్, వెలుగు: సన్న వడ్లతోనే మొదటగా రూ. 500 బోనస్ హామీని ప్రారంభించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రూ. 500 బోనస్‌ను ఎక్కడో ఓ చోట నుంచి మొదలు పెట్టాలని, అందుకే సన్న ధాన్యం నుంచి మొదలు పెట్టామని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ విషయంలో తాను ఇంతకన్నా స్పష్టత ఇవ్వలేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని, వాళ్ల స్వార్థం కోసం రైతులను ఆగం చేయాలనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. మంగళవారం గాంధీ భవన్ లో మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడారు. తడిసిన, మొలకెత్తిన వడ్లను కూడా మద్దతు ధరకే కొంటామని, ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని సూచించారు.
‘‘ఇది ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, ఎంత ఖర్చు అయినా సరే కొనుగోలు కేంద్రంలో ఉన్న చివరి గింజ వరకు కొంటాం. రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయి” అని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు మాత్రం రైతుల పేరుతో రాజకీయం చేస్తున్నాయని.. రైతులను అనవసరంగా భయభ్రాంతులకు గురి చేసేలా బీఆర్ఎస్, బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వంతో పోలిస్తే యాసంగిలో కొనుగోలు కేంద్రాలను ముందే ప్రారంభించామని, వాటి సంఖ్యను కూడా పెంచామని అన్నారు. ధాన్యం సేకరణ, నగదు జమ చేసే విషయాల్లో కూడా గత బీఆర్ఎస్ సర్కార్ కన్నా మెరుగ్గా ఉన్నామని చెప్పారు.
బీఆర్ఎస్, బీజేపీ నేతలవి పచ్చి అబద్ధాలు
‘‘గత ప్రభుత్వం 7,031 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే, మా ప్రభుత్వం 7,245 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. గత బీఆర్ఎస్ సర్కార్ కన్నా 214 కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేశాం. ఇవి ప్రతిపక్షాలకు నచ్చకనే మా ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నాయి. రాష్ట్రంలో అసలు ధాన్యమే కొనుగోలు చేయడం లేదంటూ, కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దవుతుందంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు” అని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు గాలి మాటలు మాట్లాడడం సరైంది కాదని ఆయన అన్నారు. ‘‘గత ఏడాది ఇదే సమయంలో నేను పాదయాత్ర చేస్తుండగా రోడ్ల వెంట ధాన్యం కుప్పలుగా పోసి రైతులు ఇబ్బంది పడేవారు. గత ప్రభుత్వం తడిసిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయలేదు. ఈ విషయాన్ని వేలాది మంది రైతులు నా పాదయాత్ర సమయంలో గోడు వెళ్లబోసుకున్నారు” అని తెలిపారు. అప్పటి సీఎం కేసీఆర్ వరి వేస్తే ఊరే అని చెప్పిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ‘‘వరి వేస్తే ఉరి అన్న వ్యక్తికి మాకు చాలా తేడా ఉంది. మేం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నం. ప్రతి గింజ కొంటాం” అని ఆయన స్పష్టం చేశారు.
రాజీవ్ చూపిన మార్గంలో ముందుకు
దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడేలా టెక్నాలజీ, కమ్యూనికేషన్ రంగాన్ని ముందు చూపుతో ప్రధానిగా రాజీవ్ గాంధీ ఆచరణలో పెట్టారని భట్టి విక్రమార్క తెలిపారు. ‘‘రాజకీయాల్లో యువతనుపెద్ద ఎత్తున ప్రోత్సహించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో యువతను భాగస్వాములను చేసిన ఘనత రాజీవ్ దే. ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతున్నాయి.. ఎంత ధాన్యం కొనుగోలు చేశాం... ఇలాంటి సమాచారం క్షణాల్లో తెలుసుకుంటున్నామంటే దీనికి రాజీవ్ గాంధీ అభివృద్ధి చేసిన టెక్నాలజీయే కారణం. ప్రజా అవసరాలను తీర్చడంలో రాజీవ్ గాంధీ చూపిన మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నది” అని పేర్కొన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్‌లో మహిళలకు పెద్దపీట
రాబోయే రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ లోని మహిళలకు పెద్దపీట వేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. మంగళవారం గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర సమావేశం జరిగింది. ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..రాబోయే రోజుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. కాంగ్రెస్ లోని అన్ని స్థాయిల్లో ఉన్న మహిళలకు నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ పదవుల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలను, ముఖ్యంగా ఉచిత బస్సు సౌకర్యం, గ్యాస్ వంటి వాటిని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని మహిళలను భట్టి కోరారు.
గాంధీ భవన్లో రాజీవ్‌కు నివాళులు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం గాంధీభవన్ లో ఆయన చిత్ర పటానికి పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, పార్టీ నేతలు కోదండ రెడ్డి, నిరంజన్, కుమర్ రావు తదితరులు పాల్గొన్నారు.