- సకాలంలో పిల్లల చేతికి టెక్ట్స్ బుక్స్ అందించేందుకు చర్యలు
- జనవరి నుంచే పుస్తకాల ప్రింటింగ్ ప్రారంభం
- మే మొదటి వారం నుంచి జిల్లా కేంద్రాలకు సప్లై.. ఇప్పటికే 1.10 కోట్ల టెక్స్ట్ బుక్స్ సరఫరా
- వారంలోగా స్కూల్ పాయింట్లకు చేరనున్న పుస్తకాలు
హైదరాబాద్, వెలుగు: స్కూళ్లు రీ ఓపెన్ అయ్యే జూన్ 12 నాడే స్టూడెంట్లకు టెక్ట్స్ బుక్స్ అందించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. అందుకు తగ్గట్టు జనవరిలోనే పుస్తకాల ప్రింటింగ్ ప్రారంభించి న స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు.. ఇప్పటికే 80 శాతానికి పైగా టెక్ట్స్ బుక్స్‌ను జిల్లాలకు చేర్చారు. మరో నాలుగైదు రోజుల్లో వంద శాతం చేరనున్నాయి. వారం, పది రోజుల్లోనే వాటిని జిల్లా కేంద్రాల నుంచి స్కూల్ పాయింట్లకు చేర్చేలా డీఈఓలు పనిచేస్తున్నారు.
జనవరి నుంచే ప్రింటింగ్
రాష్ట్రవ్యాప్తంగా 2023–24 విద్యా సంవత్సరంలో అన్ని సర్కారు, ఎయిడెడ్ స్కూళ్లల్లో సుమారు 25 లక్షలకు పైగా స్టూడెంట్స్ చదివారు. ఈ ఎన్రోల్మెంట్కు అనుగుణంగా 2024–25 విద్యా సంవత్సరంలో పుస్తకాలు ప్రింట్చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో ఒక్కోసారి స్కూళ్లు ప్రారంభమైన నెల రోజుల దాకా స్టూడెంట్స్‌కు పూర్తిస్థాయిలో పుస్తకాలు అందేవి కావు. అలాంటి సందర్భాల్లో టీచర్లు పాత పుస్తకాలను సేకరించి పాఠాలు చెప్పేవారు.
కానీ.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూళ్ల రీ ఓపెన్ కల్లా స్టూడెంట్స్ చేతుల్లో బుక్స్ ఉండాలని సర్కారు ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు జనవరిలోనే పుస్తకాల ప్రింటింగ్ ప్రారంభించారు. స్కూల్ బ్యాగుల బరువును తగ్గించాలనే లక్ష్యంతో ఈసారి బుక్స్ కవర్ పేజీలతో పాటు లోపలి పేజీల మందాన్ని తగ్గించారు.
ఈ నెల మొదటివారం నుంచే జిల్లాలకు
మే నెల మొదటి వారం నుంచే పుస్తకాలను జిల్లాలకు చేర్చుతున్నారు. ఈ విద్యాసంవత్సరం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే స్టూడెంట్స్‌కు 1.49 కోట్ల పుస్తకాలు అవసరం. కాగా, గతేడాది బ్యాలెన్స్ కింద 6 లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో 1.43 కోట్ల పుస్తకాలను మాత్రమే ప్రింట్ చేశారు. వీటిలో ఇప్పటికే 1.10 కోట్ల పుస్తకాలు (80శాతం) జిల్లాలకు చేరాయి.
నాలుగైదు రోజుల్లో మిగిలిన పుస్తకాలూ జిల్లా కేంద్రాలకు చేరుతాయని అధికారులు చెప్తున్నారు. జూన్ మొదటివారంలోగా జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు.. అక్కడి నుంచి స్కూల్ పాయింట్లకు పంపించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో మండల పాయింట్లకు పుస్తకాలు చేరుకున్నాయని అధికారులు చెప్తున్నారు. జూన్ 1 నుంచే బడిబాట కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఈ సందర్భంలోనే స్కూళ్లు రీ ఓపెన్ అయ్యే జూన్ 12వ తేదీన ప్రజాప్రతినిధులతో పుస్తకాలను పంపిణీ చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం స్పెషల్ ఫోకస్
విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్కూళ్లు, కాలేజీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే.. విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. తాజాగా మరోసారి పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీపై రివ్యూ చేశారు. మంత్రివర్గంలోనూ ఈ అంశంపై చర్చించారు. సకాలంలో స్టూడెంట్స్‌కు పుస్తకాలు, యూనిఫామ్ అందించాలని ఆదేశించారు. దీంతో అధికారులు పుస్తకాల పంపిణీ ప్రక్రియ స్పీడప్ చేశారు.
జూన్ 5 నుంచి సేల్స్ బుక్స్
ప్రైవేటు స్కూళ్లలో చదివే స్టూడెంట్స్‌కు ఎస్సీఈఆర్టీ పుస్తకాలను వచ్చే నెలలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సారి పుస్తకాల పేజీల మందం తగ్గడంతో రేట్లు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. జూన్ 5 నుంచి ఎంపిక చేసిన బుక్ స్టోర్స్‌లో అమ్మకానికి పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.