వి ద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి క్లాస్‌రూముల్లో కృత్యాత్మకమైన విద్యావిధానం ద్వారా గతంలో నిరంతర ప్రయత్నం జరిగేది. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయిల్లో రూపొందించిన విద్య, పాఠ్య, విషయప్రణాళికలు ఆయా తరగతులకు అనుకూలంగా ఉండేవి. పాఠ్య పుస్తక రచనలో విషయ నిర్దిష్టత, యోగ్యత, ఔపయోగికత, అనుసరణీయత, ఆచరణ యోగ్యత, బోధనా సౌలభ్యం తదితర అంశాలను మూల్యాంకనం అంశాలుగా గ్రహించి అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు. భాష, భాషేతర పుస్తక నిర్మాణంలో అనుభవజ్ఞులైన విద్యావేత్తలు, బోధనా రంగంలో విశేషానుభవం కలిగిన విషయ, భాషా నిపుణులు పాల్గొనేవారు.
నిష్ణాతుల పర్యవేక్షణ, నియంత్రణ, సంపాదకత్వంలో పుస్తక రచన సాగేది. పాఠ్యపుస్తక రచన తర్వాత వాటిని ఆమూలాగ్రం పరిశీలించి, పేలవంగా, అసమగ్రంగా, వివాదాస్పదంగా ఉన్నవాటిని తొలగించడం తప్పనిసరి నిబంధనగా ఉండేది. ఎంత పెద్ద రచయిత రాసిన పాఠ్యాంశమైనా సరే.. దాని లక్ష్యం, ఎంపిక, విషయ ప్రదర్శన, అంశక్రమ విభాగం అభ్యసనానుభవాల ఎంపిక, అభ్యసనానుభవాల వ్యవస్థీకరణ, బోధనాభ్యసన మూల్యాంకనం అనుగుణంగా లేకుంటే దాన్ని తొలగించడం జరిగేది. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం అలాంటి చర్యలు కృత్రిమంగా, నాసిరకంగా జరుగుతున్నాయనిపిస్తున్నది. తెలుగు వాచకాల్లోని పాఠాలను గమనిస్తే.. రచయితలు ఏదో రాసి మమ అనిపించినట్టుగానే కనిపిస్తున్నది.
విద్యార్థుల స్థాయి తెలియకుండా రచన?
‘అందరికీ చదువు’ పథకం 30 ఏండ్ల నుంచి అందని ద్రాక్షపండే. నల్లబల్ల పథకం అటకెక్కింది, దృశ్యశ్రవణ బోధన అంతా మిథ్యే. పాఠశాల గ్రంథాలయాలు పేరుకుమాత్రమే. విస్తారపఠనం కోసం రచించిన చిన్నారుల ఉపవాచకాల ఊసే లేదు. అనియత విద్యాపథకం అభాసుపాలైంది. జనాభా విద్య గతితప్పింది. బాలికల విద్య, స్త్రీవిద్య, మహిళా సాధికారత, స్త్రీ సమానత్వం అంతా కాగితాలకే పరిమితం. ‘దుర్గాబాయి దేశ్‌ముఖ్ నేషనల్కమిటీ ఆన్ఉమెన్స్ఎడ్యుకేషన్1958’లో ప్రతిపాదించిన ఎన్నో అంశాలు ఈనాటికీ అమలుకు నోచుకోలేదు. ఇకపోతే 1986 నూతన విద్యావిధానంలో పొందుపరిచిన మూల్యాంకనం, సమగ్ర మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం విద్యారంగంలో నేడు మూడుముక్కలాటగా మిగిలింది. దాని గురించిన సమగ్ర అవగాహన ప్రస్తుతం టీచర్లలో ఆశించిన స్థాయిలో లేదు. పరీక్షలు, మూల్యాంకనంకు సంబంధించిన తేడాలేవి తెలియకుండా ‘నిరంతర సమగ్ర మూల్యాంకన’మంటూ పదో తరగతి పరీక్షా పత్రాల్లో అస్తవ్యస్తమైన పద్ధతిలో ప్రశ్నలిస్తూ విద్యార్థులను అయోమయానికి గురిచేస్తున్నారు. సీసీఈ అంటూ పాఠ్యపుస్తకాల్లో సంసిద్ధతా పాఠం, అసలుపాఠం, తోకపాఠాలను పెట్టి పాఠ్యాంశాన్ని చిందరవందర చేశారు. తొమ్మిదో తరగతి తెలుగు వాచకంలోని మొదటి పాఠం తిక్కన రాసిన ‘శాంతి కాంక్ష’లో హిరోషిమా బాంబుదాడి సంసిద్ధాత పాఠం, అసలు పాఠం భారతంలోని శాంతిరాయబారం, తోకపాఠంలో నెల్సన్మండేలా, గాంధీజీల ప్రసక్తి పెట్టారు.
అన్నిట్లో తలాతోకలేని ప్రశ్నలు, ప్రతిపాఠానికొక ప్రాజెక్టు పని. శాంతికాంక్షలోని ప్రాజెక్టు పనిలో విద్యార్థులు వారి వారి వీధుల్లో, వాడలో శాంతి కోసం పాటుపడిన ఒక వ్యక్తిని గుర్తించి అతనితో ముఖాముఖి నిర్వహించి, అతడు శాంతి కోసం పాటుపడుతున్న తీరు తెలుసుకొని ఒక నివేదిక తయారు చేసి సమర్పించాలట. ఇలా అవగాహన లేని ప్రశ్నలు, పేలవమైన, చౌకబారు అభ్యాసాలు, అంశక్రమ విధానాన్ని పాటించకుండా, ప్రదర్శన సరిగా లేని పాఠాలు రాసిన రచయితలు ఏనాడూ ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత తరగతుల్లో కాలుపెట్టని, క్లాస్రూమ్గడపతొక్కని విద్యావంతులు, విశ్వవిద్యాలయ శాఖాధిపతులు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, కాకాలు పట్టేవారు, పదవుల కోసం పాకులాడే పైరవీకారులే అన్న విషయం గుర్తుంచుకోవాలి. విద్యార్థుల స్థాయి, అగచాట్లు వారికి పట్టవు. వాచకనాణ్యత, గుణాత్మకత గురించిన అవగాహన శూన్యం. జవాబుదారీతనం, పారదర్శకత, నిజాయితీ, నిబద్ధత ఏమీ ఉండవు. ఆదర్శ పాఠ్యపుస్తక నిర్మాణ సూత్రాలు వారికి తెలియవు. విద్యా మానసిక శాస్త్రం, విద్యాతాత్విక శాస్త్ర, తెలుగు అధ్యాపనాశాస్త్ర మార్గదర్శనం, విషయనిపుణత, భాషా నైపుణ్యాలు వారికి లేవు. ఇలాంటి అనర్హులు, అనుభవం లేని వారితో పాఠ్యపుస్తకాలు రాయిస్తే లాభం ఏంటి?
బృహత్తర బాధ్యతను మరవొద్దు
పాఠ్యపుస్తక రచనా నిర్వాహకులు, సమన్వయకర్తలు దశాబ్దాలుగా రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో తిష్టవేసి ప్రభుత్వాధినేతల, అధికారుల అండదండలతో పబ్బంగడుపుకుంటున్న వృత్తి ప్రవీణులు. ఈ మధ్యకాలంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ వలసదారులకు, శరణాగతులకు, పైరవీకారులకు కూడలి కూడా అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖకది ‘తెల్ల ఏనుగు’లా మారింది. దీన్ని బట్టి రాష్ట్రంలో మంచి రచయితలకు కరువు ఏర్పడిందనే సత్యాన్ని ఒప్పుకోక తప్పదు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు వాచకాలన్నీ మూసపద్ధతిలోనే ఉన్నాయి. ‘‘సీత ఇష్టాలు”బుర్రకథ (ఏడో తరగతి పదో పాఠం)లో విషయ పరిపుష్టత, నిర్దిష్టత, గుణాత్మకత, నాణ్యత ఎంత వెతికినా కనబడదు. పాఠంలో అనుక్రమణత లేదు. బోధనా సౌలభ్యం శూన్యం. సాంస్కృతికాంశాన్ని చచ్చిచెడి పాఠంగా రాయడంలో కూడా రచయితల బృందం అభాసుపాలయ్యారు.
ఇలాంటి చెత్త పాఠాలకు అమోదం తెలిపిన సంపాదకులు, పాఠ్యపుస్తక నిర్మాణంలో ఎలాంటి బాధ్యత తీసుకున్నారో తెలియడం లేదు. ఏడో తరగతి తెలుగు వాచకం 2వ పాఠం ‘నాయనమ్మ’ చౌకబారు, పేలవమైన, నాసిరకం ప్రదర్శనకు తార్కాణం. కథానికకు ఉండాల్సిన పరిపూర్ణత, నిర్ధిష్ట లక్షణాలు, అభిషలషణీయమైన, ఆమోదయోగ్యమైన, హేతుబద్ధమైన విషయ సమగ్రత ఈ పాఠంలో లేదు. పసితనంలోనే పిల్లలు ఇలాంటి కుయుక్తులు పన్నుతారా? అనేది ప్రశ్న. ఇలాంటి రుణాత్మక పాఠాలు పరిహరణీయాలు. బిందెలో నీళ్లు పోసి పెట్టడమనే ఈ భావన 2016 మార్చి నెలలోని స్టార్ప్లస్టీవీ చానల్లో సాధీ సీరియల్లో(కోడలు అత్తకు పెట్టినట్లుగా) ఉంది. రచయితలు, రచయితల బృందం ఇలాంటి లేకిడి రాతలకు ఎందుకు పూనుకుంటున్నారో తెలియడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే వాచకాలన్నింటిలో రచయితల రచనా విన్యాసానికి అంతుపొంతు ఉండటం లేదు.
ఎన్నాళ్లీ భావదాస్యం, భాషా దారిద్ర్యం, ఇది ఎప్పుడు అంతమవుతుందో! విద్యార్థి భావ పరిధిని పెంచి, భాషా సామ్రాజ్యాన్ని విస్తృతపరచాల్సిన బాధ్యత, కర్తవ్యం ప్రణాళికా నిర్మాతలు, పాలకులు, నిర్వాహకులు, విద్యావేత్తలు, మేధావులు, తెలుగు భాషా సంఘాలు, చైతన్య సమితులు, భాషా పరిరక్షణ అధ్యయన కేంద్రాలు, ప్రభుత్వాలు, పాఠశాలలు, భాషోపాధ్యాయులు, పాఠ్యపుస్తకాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఆషామాషీగా, అల్లాటప్పాగా, మొక్కుబడిగా పాఠ్యపుస్తకాలు రాసి చేతులు దులుపుకుంటే కాదు. పాఠ్యపుస్తక రచన అంటే ‘ఆటవిడుపు’ కాదు. అది ఒక పవిత్రమైన యజ్ఞం. దేశభవితవ్యాన్ని తీర్చిదిద్దే మహోన్నత కార్యక్రమం. దయచేసి దాన్ని అపహాస్యం చేయొద్దు.
మారుతున్న పుస్తకాలు
1986 నూతన విద్యావిధానంలో పేర్కొన్న పది మౌలికాంశాలను పాఠ్యప్రణాళిక, పాఠ్యపుస్తక రచన, తయారీ, బోధన, అభ్యసన ప్రక్రియలలో అంతర్లీనం చేసి జాతీయ విలువల్ని, వైయక్తిక, సామాజిక విలువల్ని పెంచి ఉమ్మడి సభ్యత, సంస్కృతి విలువల వాతావరణాన్ని సృష్టించాలి. కానీ అవేమీ జరగడం లేదు. ప్రొఫెసర్ దవే ప్రతిపాదించిన కనీస అభ్యసన స్థాయిలు, ప్రొ. యశ్పాల్ భార రహిత విద్య(స్కూల్‌బ్యాగ్ బరువు) అంశాల గురించి ఎలాంటి శ్రద్ధ తీసుకోవడం లేదు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత తరగతుల పుస్తకాల్లో సెకండరీ విద్యాస్థాయిల్లో అస్తవ్యస్తత, అసమగ్రత, అసంబద్ధత, అశాస్త్రీయత కనిపించడం శోచనీయం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాఠ్యపుస్తకాలు మారడం తరచు జరుగుతున్నది.
2008 నుంచి ఇప్పటి వరకు నాలుగైదుసార్లు మారాయి. ప్రైవేటు విద్యాసంస్థలన్నీ బడా నాయకులు, సినీరంగ ప్రముఖులు, ప్రజాప్రతినిధుల అధీనంలోనే ఉన్నాయి. మోయలేని పుస్తకాల బరువు, ఫీజుల మోత, ఆంగ్లభాషా వ్యామోహం, అరకొర వసతులు, కిక్కిరిసిన తరగతి గదులు, విద్యార్హతలు సరిగాలేని టీచర్లు, నియంత్రణ కరువైన విద్యాసంస్థల పాలనావిధానం, ఇతరత్రా వ్యాపారాలు, వ్యాపకాలు వెరసి విద్యావిలువలు నాశనం అవుతున్నాయి. ఈ అస్తవ్యస్త వ్యవస్థకు ఎవరు కారణమనేది మన ముందు ఉన్న ప్రశ్న. ధనాపేక్ష, అధికారదాహం, కర్రపెత్తనం, నియంత్రణలోపం, పర్యవేక్షణ కొరత, వనరుల లేమి, లంచగొండితనం, ప్రలోభం, సామర్థ్యాలు, నైపుణ్యాలు లోపించడం, ఉపేక్ష, నిస్సహాయత ఇలా ఎన్నో తలకుమించిన సమస్యలే!
- డా. సరోజన బండ, విశ్రాంతాచార్యులు, ఎస్సీఈఆర్టీ