హెచ్​ఎండీఏ పరిధిలో హైరైస్​ బిల్డింగుల జోరు

హెచ్​ఎండీఏ పరిధిలో హైరైస్​ బిల్డింగుల జోరు

 

  • 40 నుంచి 60 అంతస్తుల భవనాల నిర్మాణాలకు దరఖాస్తులు
  • ఎత్తయిన బిల్డింగుల్లో నివసించేందుకే నగరవాసుల ఆసక్తి
  • నిరుడి కంటే ఈ సంవత్సరం ఎక్కువగా అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు:  గ్రేటర్​హైదరాబాద్​లో ఆకాశహర్మ్యాల నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ఎత్తయిన బిల్డింగుల్లో ఉండేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తుండడంతో  పెద్దపెద్ద కంపెనీలు  భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాయి. హైరైస్​ భవనాల నిర్మాణాల వైపే రియల్టర్లు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం హెచ్ఎండీఏకు భారీ నిర్మాణాల కోసం పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి. హైదరాబాద్​నగరంలో రియల్​ఎస్టేట్​ పుంజుకుంటున్నదనేదానికి ఈ దరఖాస్తులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2023 సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాదిలోనే ఆకాశహర్మ్యాల జోరు ఎక్కువగా వుందని అధికారులు తెలిపారు. నిరుడు హెచ్ఎండీఏకు నెలకు 4 నుంచి 6 దరఖాస్తులే వచ్చేవని, ప్రస్తుతం నెలకు 15 నుంచి 20 కొత్త అప్లికేషన్లు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. కేవలం అపార్ట్​మెంట్లే కాకుండా వాణిజ్య భవనాలు సైతం భారీ ఎత్తులో నిర్మిస్తున్నారు. 

హైరైస్​ బిల్డింగుల నిర్మాణం కోసం పెరిగిన అప్లికేషన్లు

నగర వాసుల్లో పెరుగుతున్న అభిరుచులకు తగ్గట్టుగా నిర్మాణ సంస్థలు హైరైస్​ బిల్డింగుల నిర్మాణానికి ఆసక్తి చూపిస్తున్నాయి. గడిచిన రెండు మూడు నెలల్లోనే ఇందుకు సంబంధించిన  దాదాపు 250 వరకు దరఖాస్తులకు అనుమతి ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా 40 నుంచి 60 అంతస్తుల భవనాలకు పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నట్టు హెచ్ఎండీఏ ఆఫీసర్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి  నుంచి ఇప్పటి వరకూ నెలకు 15 నుంచి 20 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. ముఖ్యంగా గచ్చిబౌలి, నానక్​రామ్​గూడ, మోకిల, బుద్వేల్, కోకాపేట, మేడ్చల్​ తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఆకాశహర్మ్యాల నిర్మాణానికి దరఖాస్తులు వస్తున్నట్టు చెప్పారు. వీటిలో ఎక్కువ సంఖ్యలో 40 నుంచి 60 అంతస్తుల హైరైస్​ బిల్డింగులు ఉన్నట్టు వెల్లడించారు.  గత రెండు నెలల కాలంలో పుప్పాలగూడలో 2, ఉస్మాన్​నగర్​4, తెల్లాపూర్​4, మంచిరేవుల 2, కిస్మత్​పుర4, కొంపల్లి 3,  కోకాపేట‌‌‌‌‌‌‌‌లో 2 హైరైస్​ బిల్డింగుల నిర్మాణం కోసం అప్లికేషన్స్​ వచ్చినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు కూడా భారీగా పెరగడంతో హైరైస్​భవనాల్లో ఫ్లాట్స్​ కూడా  రూ.2 కోట్ల  నుంచి రూ. 3 కోట్ల వరకు ధర పలుకుతున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి హైదరాబాద్​ నగరం రాబోయే రోజుల్లో రియల్​రంగంలో నెంబర్​ వన్​గా ఎదిగే అవకాశం ఉందని రియల్ఎస్టేట్​ నిపుణులు అంటున్నారు. ఇక్కడ భద్రతతోపాటు దేశంలో ఎక్కడా లేని విధంగా అనువైన వాతావరణం కలిగి ఉండడం, మౌలిక వసతులు, ప్రభుత్వం తరపున వివిధ అనుమతులు సులభతరంగా ఉండడం ఇందుకు కారణమని వారు విశ్లేషిస్తున్నారు.  

రియల్​ జోరు..

హైదరాబాద్ ​నగరంలో రియల్​ ఎస్టేట్ ​ఊపందుకుంటున్నది. ఒక పక్క ఇప్పటికే భూముల ధరలు భారీగా పెరగ్గా, త్వరలో ప్రభుత్వం కూడా ల్యాండ్​ వ్యాల్యూ మరింత పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో ముంబై, బెంగళూరు తర్వాత  హైదరాబాద్​లోనూ ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉందని రియల్​ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు. నిరుడు గ్రేటర్​ పరిధిలో 2,06,849 స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్​లు రిజిస్టర్​ కాగా, ఈ ఏడాది ఆరు నెలల కాలంలోనే 2,14,217 డాక్యుమెంట్లు రిజిస్టర్ ​అయ్యాయి. గతేడాది చివరి నాలుగు నెలల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం 3,181.68 కోట్లు కాగా, ఈ ఏడాది ఐదు నెలల్లోనే ప్రభుత్వానికి 3,407.15 కోట్ల ఆదాయం సమకూరింది.  నిరుడు సగటున నెలకు 51,712 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ ​అయితే.. ఈ ఏడాది సగటున నెలకు 53,554 డాక్యుమెంట్లు రిజిస్టర్ ​అయినట్టు అధికారులు తెలిపారు. దీంతో హైదరాబాద్​ నగరంలో రియల్​ ఎస్టేట్​ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ కంపెనీలు సైతం ఆసక్తి చూపిస్తున్నట్టు రియల్​ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో 8 జిల్లాలు ఉన్నాయి. అయితే రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల పరిధిలోనే అధికంగా రియల్​ ఎస్టేట్ పుంజుకుందని, మొత్తం రియల్ ​ఎస్టేట్ లావాదేవీల్లో 60 శాతం వాటా ఈ రెండు జిల్లాలదేనని రియల్​ నిపుణులు వెల్లడించారు.