యాదాద్రి, వెలుగు: తెలంగాణకు బీజేపీ ఎంతో మేలు చేసిందని, ఆ విషయం మంత్రి హరీశ్‌రావుకూ తెలుసని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్అన్నారు. ఇద్దరం కలిసే కేంద్రం నుంచి కొన్ని ప్రాజెక్టులు సాధించామని చెప్పారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో బీజేపీ అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ రావు అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తనకు టీఆర్‌ఎస్ నుంచి ఎంపీ టికెట్ ఖాయమని తెలిసినా తెలంగాణ భవిష్యత్ కోసం బీజేపీలో చేరానన్నారు.
టీఆర్‌ఎస్ వల్ల తెలంగాణ రాలేదని, బీజేపీ మద్దతు ఇవ్వడం వల్లే వచ్చిందని గుర్తుచేశారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో టీఆర్‌ఎస్ తనకు సహకరించలేదని, ఆ టైమ్‌లో తాను ఎన్నో అవమానాలకు గురయ్యాయని చెప్పారు. బీజేపీ వల్లనే బీబీనగర్‌లో ఎయిమ్స్ వచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 వేల కిలోమీటర్ల నేషనల్ హైవేలు వస్తే, ఒక్క భువనగిరి పరిధిలో 400 కిలోమీటర్ల రోడ్డు వచ్చిందని చెప్పారు. ధరణి పోర్టల్ కుట్ర పూరితంగా తెచ్చారని ఆరోపించారు. కేసీఆర్ నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు.