ఇవాళ ముఖ్య నాయకులతో భేటీ కానున్న బూర నర్సయ్య గౌడ్

టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బూర నర్సయ్య గౌడ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రానున్నారు. నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసిన ఆయన ఇవాళ సాయంత్రం 5 గంటలకు హస్తిన నుంచి హైదరాబాద్ కు బయల్దేరనున్నారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా భువనగిరికి చేరుకుని అక్కడ ముఖ్య నాయకులతో  ఇవాళ రాత్రి  సమావేశం కానున్నారు. ఈ నెల 28 లేదా 29న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలోనే బూర నర్సయ్య గౌడ్ కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 30న సీఎం కేసీఆర్ సభ ఉండటంతో.. అంతకు ముందే సభ నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. దీనికి చీఫ్ గెస్ట్​గా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ను ఆహ్వానించాలని ప్లాన్​ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం కేసీఆర్ కు బూర నర్సయ్యగౌడ్ లేఖ పంపారు. 2009 నుంచి తెలంగాణ ఉద్యమం, పార్టీ ప్రస్థానంపై లేఖలో ప్రస్తవించారు .2019లో ఎంపీగా ఓడిన తర్వాత చాలా అవమానాలు ఎదుర్కొంటున్నానని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో బూర నర్సయ్య గౌడ్ క్రియాశీలక పాత్ర పోషించారు. 2013 సంవత్సరంలో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019లో జరిగిన  లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.