- అట్టడుగు వర్గాల సమస్యలు సీఎం దృష్టికి తేలేనప్పుడు టీఆర్‌ఎస్‌లో ఉండి లాభం లేదు
- హైదరాబాద్‌లో జయశంకర్ సార్ విగ్రహం ఎందుకు పెట్టలే
- బడుగుల సమస్యలు తీర్చమంటే అసహనమెందుకు?
- బీసీలకు టికెట్ ఇవ్వాలని కోరడం నేరమా?
- ధరణితో రైతులకు ఎన్నో అవస్థలు
హైదరాబాద్/ న్యూఢిల్లీ: వెలుగు : అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉందని.. బడుగు బలహీన వర్గాల సమస్యలేవి ప్రస్తావించలేనప్పుడు బానిసలా టీఆర్ఎస్‌లో ఉండి ప్రయోజనం లేదని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మండిపడ్డారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు శనివారం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై అందులో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనలో లోపాలను ఏకరువు పెట్టారు. టీఆర్‌ఎస్‌లో తనకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని, తనకు అవకాశాలు రాకున్నా పర్వాలేదు కానీ అట్టడుగు వర్గాల సమస్యలు సీఎం దృష్టికి తీసుకువచ్చే అవకాశమే లేనప్పుడు పార్టీలో కొనసాగడం అర్థరహితమన్నారు. రాజకీయ వెట్టి చాకిరీని తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరని హెచ్చరించారు. 2019లో ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎన్నో అవమానాలు ఎదురైనా కేసీఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా వాటిని భరించానన్నారు. తాను పదవుల కోసం పైరవీలు చేసే వ్యక్తిని కాదని తెలిసినా.. కనీసం ప్రజా సమస్యలు చెప్పే అవకాశం కూడా కల్పించలేదని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల సమస్యలను ప్రస్తావించినపుడు తనపై అసహనం వ్యక్తం చేయడం ఉద్యమకారుడిగా తనను ఎంతో బాధించిందన్నారు. తాను ఎప్పుడూ ప్రజాసమస్యలను ప్రస్తావించానే తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం పైరవీలు చేయలేదని తెలిపారు.
ఉద్యమకారులకు అపాయింట్మెంటే దొరకట్లే
పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే నిర్ణయాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లే అవకాశమే లేకపోతే తాను టీఆర్‌ఎస్‌లో ఉండి ఏం చేయాలని బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌లో సమస్యలు, జీపీ లే ఔట్స్‌లో రిజిస్ట్రేషన్‌లపై బ్యాన్ పెట్టడం, దళితుల అసైన్డ్ భూముల్లో లే ఔట్స్ చేయడం, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌ల మధ్య సంతకాల విషయంలో పోరు, కులవృత్తుల ఫెడరేషన్స్‌ను నిర్వీర్యం చేయడం, బీసీ, ఈబీసీ విద్యార్థులకు కేవలం 11 శాతమే ఫీ రీయింబర్స్‌మెంట్ వంటి నిర్ణయాలతో ఆయా వర్గాలు చాలా అవస్థలు పడ్డాయన్నారు. ‘‘ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇతర ప్రాంతాల వాళ్లు ఇక్కడ రొయ్యలు అమ్ముకోవచ్చు.. కర్రీ పాయింట్లు పెట్టుకోవచ్చు కానీ ప్రభుత్వంలో, సెక్రటేరియెట్‌లో మాత్రం తెలంగాణ వాళ్లు ఉంటారని చెప్పాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇతర ప్రాంతాల కాంట్రాక్టర్ల టీడీఎస్ స్థాయిలో కూడా టర్నోవర్ లేదని సొంత రాష్ట్ర కాంట్రాక్టర్లు వాపోతున్నరు. ఉద్యమంలో కేసీఆర్‌తో నెలలు, ఏండ్లు గడిపిన సన్నిహితులు, ఉద్యమ సహచరులు ఇప్పుడు ఒక నిమిషం ఆయన్ను కలువాలంటే అప్పటి కన్నా పెద్ద ఉద్యమమే చేయాల్సి వస్తోంది. తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసిన జయశంకర్ సార్ ఆరు అంగుళాల విగ్రహం కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయకపోవడం అందరినీ బాధిస్తోంది”అని అన్నారు.
బీసీలపై రాజకీయ, ఆర్థిక రంగాల్లో వివక్ష
మునుగోడులో ఉప ఎన్నిక జరుగుతుంటే మాజీ ఎంపీనైన తనతో కనీసం ఒక్కసారి కూడా మాట్లాడలేదని నర్సయ్య గౌడ్చెప్పారు. నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమ్మేళానాలకు తనకు ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఇవ్వలేదని, అయినా అవమానాన్ని దిగమింగుకున్నానన్నారు. తనకు ఎదురైన అవమానాలు కేసీఆర్‌కు తెలిసినా మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. మునుగోడు టికెట్ అన్నది అసలు సమస్యే కాదని, బీసీలకు టికెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అడగడం కూడా నేరమే అయితే ఈ పార్టీలో ఉండటమే అనవసరమన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీలు ఆర్థిక, రాజకీయ, విద్య రంగాల్లో వివక్షకు గురికావడం బాధాకరమన్నారు. భువనగిరి ఎంపీగా నియోజకవర్గంతో పాటు తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం, నేషనల్ హైవేస్ సహా ఎన్నో పనుల కోసం ఢిల్లీలో తన వంతు పాత్ర పోషించానన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీగా తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యేల గెలుపు కోసం ప్రచారం చేశానని, తిరిగి మీరు ముఖ్యమంత్రి కావాలన్న కసితో పనిచేశానని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడానికి పార్టీలో అంతర్గతంగా జరిగిన కుట్రలే కారణమని వివరించారు. రెండోసారి తనకు పోటీ చేసే అవకాశం ఇచ్చారనే కృతజ్ఞతతోనే అవమానాలు ఇన్నాళ్లు భరిస్తూ వచ్చానని, ప్రజా సమస్యలే చెప్పలేనప్పుడు పార్టీలో కొనసాగి ఉపయోగం లేదనే రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
దీపావళి లోపు నిర్ణయం
మునుగోడు ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని కోరడమే తప్పా అని నర్సయ్యగౌడ్ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత ఆయన శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎక్కడో కట్టేసి బొక్క వేస్తానంటే కూర్చోడానికి తాను పెంపుడు జంతువును కానని, ఇదేమీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాదన్నారు. టికెట్ ఇచ్చాం కాబట్టి చెప్పిందే చేయాలంటే ఎవరూ సహించబోరన్నారు. తన రాజీనామాను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే అభినందిస్తున్నారని, తమ ఇజ్జత్ పెంచావ్ అని పొగుడుతున్నారన్నారు. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రం నుంచి చాలా మంది ఫోన్ చేసి మంచి నిర్ణయం తీసుకున్నావని అభినందిస్తున్నారు. తన రాజీనామాతోనైనా టీఆర్‌ఎస్‌లో మిగతా లీడర్లకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇస్తే మంచిదన్నారు. తాను ఏ పార్టీలో చేరుతాననేది దీపావళి లోపు నిర్ణయం తీసుకుంటానన్నారు.
టీఆర్ఎస్లో ఏ లీడర్ కూడా ఉండరు
రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్ లో ఏ లీడర్ కూడా ఉండబోరని, కేసీఆర్ తీరుతో వాళ్లంతా ఇబ్బంది పడుతున్నారని బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శనివారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతికి వెళ్తే ఎల్1, ఎల్2, సర్వ దర్శనం మాదిరిగానే కేసీఆర్‌ను లీడర్లు దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. టీఆర్‌ఎస్ లో ఏ నేతకూ గౌరవం లేదన్నారు. కేసీఆర్తీరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలే కాదు ఓసీ లీడర్లు సైతం డోర్లు పెట్టుకొని ఏడ్చుడు ఒక్కటే తక్కువన్నారు. ఈ ప్రభుత్వంలో మంత్రుల పరిస్థితి కౌన్సిలర్ కన్న తక్కువ స్థాయిలో ఉందని, వాళ్ల శాఖల్లో ఏం జరుగుతుంతో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణ ఏర్పడితే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని అనుకున్నానని, కేసీఆర్ తీరుతో ఆ పరిస్థితి లేదన్నారు.