బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భేటీ అయిన ఫొటో బయటకొచ్చింది. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పై అసంతృప్తితో ఆ పార్టీకి రాజీనామా చేసిన బూర నర్సయ్య.. ఢిల్లీలో పలువురు బీజేపీ పెద్దలతో సమావేశమైనట్లు ప్రచారం జరిగింది. బూర నర్సయ్య గౌడ్ రెండ్రోజులు ఢిల్లీలో పడిగాపులు కాసినా తరుణ్ చుగ్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని మంత్రి జగదీష్ రెడ్డి ట్వీట్ చేసిన నేపథ్యంలో ఈ ఫొటో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ ఉద్యమంలో బూర నర్సయ్య గౌడ్ క్రియాశీలక పాత్ర పోషించారు. 2013 సంవత్సరంలో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. .2019లో ఎంపీగా ఓడిన తర్వాత చాలా అవమానాలు ఎదుర్కొంటున్నానని తన రాజీనామా లేఖలో బూర నర్సయ్య పేర్కొన్నారు.