సర్కారు వైద్యం బాగుంటే.. ఢిల్లీకి ఎందుకు పోతున్నట్టు? : బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు వైద్యం వెలుగులు జిమ్ముతోందంటూ ప్రకటనలు ఇస్తున్నారని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం బాగుంటే కంటి నొప్పికి, పంటి నొప్పికి సీఎం కేసీఆర్ ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు. బుధవారం పార్టీ స్టేట్ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు. 56 శాతం డెలివరీలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు.

కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్ల నిధులన్నీ కేంద్రం నుంచే వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్  స్కీమ్​ను రాష్ట్రంలో ఎందుకు అమలు చేయట్లేదో చెప్పాలన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ఆస్పత్రులను కుదవ పెట్టి అప్పులు తీసుకున్నారని, ఆరోగ్య శ్రీ బకాయిలు మాత్రం చెల్లించట్లేదని మండిపడ్డారు. బకాయిలు ఉండటంతో హాస్పిటల్స్ పేషేంట్లను అడ్మిట్ చేసుకోవట్లేదని నర్సయ్య గౌడ్ తెలిపారు.