మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. చౌటుప్పల్ మండలం చిన్న కొండూరులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజాగోపాల్ రెడ్డి,మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు విలువలేకుండా పోయిందని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్కు అధికారం ఉందనే అహంకారంతో ఉద్యమకారులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ కావాలంటే మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మద్యం మీద వచ్చే ఆదాయంతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నడుస్తున్నాయని బూర నర్సయ్యగౌడ్ ఆరోపించారు. టీఆర్ఎస్ లో ఎమ్మెల్యే తప్ప మిగతా మండల స్థాయి, సీనియర్ కార్యకర్తలతో అవసరం లేదన్నట్లుగా ఉందన్నారు. బీజేపీ లో కార్యకర్త కూడా లీడర్ అని...కార్యకర్తకు ఏమైనా అయితే అమిత్ షా వచ్చి పరామర్శించి వారిని ఆదుకుంటారని.. అది బీజేపీ అంటే అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులంతా అధికార పార్టీని వీడి బీజేపీలోకి ఎందుకు వస్తున్నారో టీఆర్ఎస్ కార్యకర్తలు అర్థం చేసుకోవాలన్నారు. తాను బీజేపీలో చేరాననే భయంతో పాత బీసీ నాయకులందరినీ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని బూర నర్సయ్యగౌడ్ తెలిపారు.