మంత్రులు కక్కలేక మింగలేక ఏడుస్తున్నరు : బూర నర్సయ్య గౌడ్

నో డ్రాఫ్ట్.. నో డిస్కషన్.. ఓన్లీ డెసిషన్ అనేలా తెలంగాణలో ఇష్టారాజ్యంగా, గుడ్డిగా పాలనా నిర్ణయాలను తీసుకుంటున్నరని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రులు కక్కలేక మింగలేక కుమిలిపోతూ ఏడుస్తున్నరని వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చింది దీనికోసమేనా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ వీడటానికి గల కారణాలను ‘v6’ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూలో  ఆయన వివరించారు.

కేసీఆర్ లో ఎలాంటి మార్పు వచ్చింది ? 

‘‘ అప్పటికి.. ఇప్పటికి కేసీఆర్ తీరులో ఎంతో మార్పు వచ్చింది. ఉద్యమ నేతగా, తొలిసారి సీఎంగా, రెండోసారి సీఎంగా కేసీఆర్ లో ఎన్నో మార్పులను చూశాం.  సీఎం కంటే కేసీఆర్ అనే పేరే పెద్దది. ఆయనంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. కేసీఆర్ ఉద్యమ సమయంలో ఎంతో కలుపుగోలుగా ఉండేవారు. ఆ తర్వాత కూడా ఆయన తీసుకున్న చాలా నిర్ణయాలను నేను సమర్ధించాను. వెంట నడిచాను. కొన్నిసార్లు సలహాలు ఇచ్చిన సందర్భాల్లో నేను చివాట్లు  కూడా తినాల్సి వచ్చింది. పవర్ ఎక్కువైన తర్వాత.. రెండు సార్లు సీఎం అయిన తర్వాత  ప్రజలతో కేసీఆర్ కు కనెక్టివిటీ తెగిపోయింది. నాయకులు, కార్యకర్తల సమస్యలను కేసీఆర్ తెలుసుకోవడం బంద్ అయింది. వాస్తవ పరిస్థితులు చెప్పే వాళ్ల కంటే భజన చేసే బ్యాచ్ కేసీఆర్ చుట్టూ మిగిలారు.  అందుకే కేసీఆర్ దగ్గర టీఆర్ఎస్ నేతలకు అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టంగా మారిపోయింది.’’

మీరు బీసీలకు మునుగోడు టికెట్ అడగటాన్ని టీఆర్ఎస్ ఎలా తీసుకుంది ? 

‘‘మునుగోడు టికెట్ బీసీలకు పరిశీలించండి అని నేను అడగడాన్ని కూడా వాళ్లు భరించలేకపోయారు. బీసీలకు టికెట్ అడిగితే తప్పేంటి ? నేను బీసీలకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసిన తర్వాత..  మునుగోడు బై పోల్ కు సంబంధించి టీఆర్ఎస్  పార్టీలో అంతర్గతంగా చాలా మీటింగ్ లు జరిగాయి .. వాటికి నన్ను పిలవలేదు. కనీసం నాకు సమాచారం ఇవ్వలేదు. ఇస్తే తీసుకోవాలే కానీ..  బయట అడగడం ఏమిటి ? ఇది ఆగాలంటే బూర నర్సయ్య గౌడ్ ను కట్ చేయాలని టీఆర్ఎస్ మీటింగ్ లలో చర్చించుకున్నారట.’’

టీఆర్ఎస్ ను వీడటానికి ప్రధాన కారణమేంటి ? 

‘‘ ప్రతి నిర్ణయం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. సుదీర్ఘ కాలంగా జరిగిన సంఘటనలకు ఒక  క్లైమాక్స్ ఉంటుంది. అదే ఇది. తెలంగాణ సాధన లక్ష్యం కోసం ఆనాడు కేసీఆర్ పాత రాజకీయ బంధాలను తెంచుకొని, టీడీపీని వదులుకొని కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు.. నేను కూడా ఇప్పుడు తెలంగాణలోని అట్టడుగు వర్గాల ప్రయోజనాల కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. బీజేపీలో చేరాలని డిసైడ్ అయ్యాను. టీఆర్ఎస్ కు రాజీనామా చేశాను. చాలా బాధతో ఇలా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాను. కనీసం ఇప్పటికైనా కేసీఆర్ లో మార్పు వచ్చి.. ఆయనకు ఇలాగైనా లబ్ధి చేకూరాలని భావిస్తున్నాను. బయటికొచ్చాను కాబట్టి ఈవిధంగా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ఎమ్మెల్యే, ఎంపీ కావాలనే లక్ష్యంతో నేను బీజేపీలోకి రావట్లేదు.’’ 

కేసీఆర్ తో టీఆర్ఎస్ నేతల కనెక్టివిటీ  అంత కష్టమా ? 

‘‘ మొన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు  వచ్చేటప్పుడు.. ఒక టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నన్ను  కలిశాడు. 8 ఏళ్లుగా కేసీఆర్ ను కలవలేకపోయాను అంటూ నన్ను కౌగిలించుకొని అతడు ఏడ్చాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బీబీ నగర్ ఎయిమ్స్ కు సంబంధించిన ఒక అంశంపై చర్చించేందుకు నేను ఆయన అపాయింట్మెంట్ అడిగాను. నేనెవరో తెలియకున్నా.. రెండో రోజే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి బీబీ నగర్ ఎయిమ్స్ కు  సంబంధించిన అంశం గురించి వివరించాను. ప్రస్తుతం సీఎం కేసీఆర్ దగ్గరికి ఇలాంటి రీచ్ లేదు. మనం పోరాడి తెలంగాణ సాధించుకున్నది ఇందుకేనా? రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి.’’