- ఎందుకు ఓటెయ్యాలో చెప్తావా?
- భువనగిరి ఎమ్మెల్యేకు మాజీ ఎంపీ బూర సవాల్
- దూసుకువచ్చేందుకు టీఆర్ఎస్కార్యకర్తల యత్నం
- పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత
చౌటుప్పల్ వెలుగు: మండలంలోని జైకేసారం లో శనివారం భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రచారం సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి చెప్పాలని, ఎందుకు వేయవద్దో తాను చెప్తానని అనడం, చర్చకు వస్తావా అంటూ సవాల్ విసరడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు దూసుకువచ్చారు. ప్రతిగా బీజేపీ కార్యకర్తలు కూడా నినదించడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. శనివారం చౌటుప్పల్ మండల జైకేసారంలో బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తరపున మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బూర నర్సయ్య మాట్లాడుతూ... జైకేసారం టీఆర్ఎస్ ఇన్చార్జిగా ఉన్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి టీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని ప్రశ్నించారు. ఎందుకు వేయవద్దో చెప్పడానికి తన వద్ద వంద కారణాలున్నాయని, గ్రామానికి వస్తే చర్చిద్దామన్నారు. సాయంత్రం వరకు ఇదే గ్రామంలో ఉంటానని, ఊరిలోని 2,700 మంది ఓటర్లను పిలిచి మాట్లాడేందుకు సిద్ధమా అని పైళ్లను ప్రశ్నించారు. కాంట్రాక్టులు, ల్యాండ్ రెగ్యులరైజేషన్ తో వచ్చిన వేల కోట్లలో ప్రభుత్వం 10 శాతం కూడా ఖర్చు పెట్టడం లేదన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు లాక్కొని ఊరిలో ఒక్కరికి దళిత బంధు ఇస్తే ఎలా బాగుపడతారన్నారు. ఆయన మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు నర్సయ్య గౌడ్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. బీజేపీ ప్రచార రథం వైపు నినాదాలు చేసుకుంటూ దూసుకురావడంతో బీజేపీ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. బూర నర్సయ్య గౌడ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.