ఉపాధి కల్పనకు... బడ్జెట్​తో బూస్ట్​

ఉపాధి కల్పనకు... బడ్జెట్​తో బూస్ట్​
  • మహిళలకూ మరిన్ని అవకాశాలు..  నిపుణుల వెల్లడి


న్యూఢిల్లీ: ఈసారి బడ్జెట్​వల్ల ఉపాధి కల్పన భారీగా పెరుగుతుందని, ముఖ్యంగా శ్రామికరంగంలో మహిళల సంఖ్య మరింత ఎగబాకుతుందని నిపుణులు అంటున్నారు.  నైపుణ్యాల కల్పనకు పెద్దపీట వేశారని చెబుతున్నారు. వ్యవసాయం తరువాత దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ఎంఎస్​ఎంఈలకు సులువుగా లోన్లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 

అంతేగాక ఐదు పథకాలు, కార్యక్రమాలతో కూడిన 'ప్రధాన మంత్రి ప్యాకేజీ'ని ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. 4.1 కోట్ల మంది యువతకు రానున్న ఐదేళ్ల కాలంలో ఉపాధి, నైపుణ్యం, ఇతర అవకాశాలను కల్పించడం  కోసం రూ.2 లక్షల కోట్ల కేంద్ర వ్యయంతో ప్యాకేజీని ఇస్తామని వెల్లడించారు.  ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కోసం రూ.1.48 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 

ప్రధాన మంత్రి ప్యాకేజీలో భాగంగా 'ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల' కోసం ప్రభుత్వం మూడు పథకాలను అమలు చేస్తుంది.  మొదటిసారి ఉద్యోగార్థులను గుర్తించడం, ఉద్యోగులు, ఉద్యోగాలు కల్పించే యజమానులకు ప్రోత్సాహంపై దృష్టి సారించినట్లు  తెలిపారు. అంతేగాక నైపుణ్యం, ఉపాధి,  మహిళల అభివృద్ధికి వివిధ పథకాలను,  ప్రోత్సాహకాలను ప్రకటించారు.  

పెయిడ్​ ఇంటర్న్‌‌‌‌షిప్‌‌‌‌లు  వర్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి అవసరమైన పథకాలకు బడ్జెట్ కేటాయింపులను పెంచారు. ఈ నిర్ణయాన్ని ఇండస్ట్రీ నిపుణులు స్వాగతించారు. ఇది రాబోయే ఐదేళ్లలో ఉపాధి రంగంలో వృద్ధిని సులభతరం చేస్తుందని  చెప్పారు.   నైపుణ్యం గల శ్రామికశక్తిని సృష్టించేందుకు ప్రభుత్వం  పాఠశాల స్థాయిలో బలమైన నైపుణ్యాభివృద్ధి మౌలిక సదుపాయాలను సృష్టించడంపై దృష్టి సారించాలని సూచించారు. 

ఉపాధి కల్పన పరిశ్రమలకు ఊతం

ఈ బడ్జెట్​ ఉపాధి  నైపుణ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించడమే గాక యువతకు అవకాశాలు కల్పించే వివిధ పరిశ్రమలలో వృద్ధికి సాయపడుతుందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పించగల డ్రోన్‌‌‌‌లు, సోలార్, ఈవీలకు మనదేశం గ్లోబల్ హబ్‌‌‌‌గా మారాలనే ఉద్దేశంతో ఈ రంగంలోని కంపెనీలకు భారీగా ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్రం ప్రకటించింది.  

 "భారత డ్రోన్ మార్కెట్ 2024 నుంచి 2028 వరకు ఏటా 5.96 శాతం వృద్ధి చెందుతోంది. 2024లో 27 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించగలదని అంచనా.  ఉపాధి, నైపుణ్యం, ఎంఎస్​ఎంఈ కోసం బడ్జెట్లో చాలా నిర్ణయాలు ప్రకటించారు. వీటికి భారీ కేటాయింపులు ఉండొచ్చని అంటున్నారు.  వివిధ కార్యక్రమాల ద్వారా శ్రామికశక్తిలో మహిళల సంఖ్యను పెంచడానికి డ్రోన్ పరిశ్రమకు ఎన్నో అవకాశాలు కల్పించింది”అని ఏబోకోడ్​ టెక్నాలజీస్​ ఫౌండర్​ శరద్​ఖన్నా చెప్పారు.   మహిళా ఎస్​హెచ్​సీ సంస్థల కోసం మార్కెట్ యాక్సెస్‌‌‌‌ను పెంచడం  వల్ల వారికి అవకాశాలు పెరుగుతాయన్నారు.