బంగారు తెలంగాణ అయిందంటే..మునుగోడు వదిలిపెడ్తం: రఘునందన్ రావు

ల్గొండ జిల్లా: మంత్రి కేటీఆర్ కు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు.  తెలంగాణ రాష్ట్రం నిజంగా బంగారు తెలంగాణ అయిందంటే.. బీజేపీ నాయకులంతా మునుగోడు నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పోతామని ప్రకటించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు కాసం వెంకటేశ్వర్లు తదితరులతో కలసి నారాయణపూర్ మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

నారాయణపూర్ మండలం గుజ్జ గ్రామంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ బరితెగిస్తోందని రఘునందన్ రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ తరపున క్షేత్ర స్థాయిలో బూత్ లెవెల్ అధికారులే  ప్రచారం చేస్తున్నారని.. టీఆర్ఎస్ కు ఓటేయమని అడుగుతున్నారని ఆరోపించారు. అధికారుల తీరుపై కలెక్టర్ గారు మీరు స్పందిస్తారా.. లేకపోతే ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయాలా? అని ప్రశ్నించారు. 

నన్ను గెలిపిస్తే ఒక రూము ఉన్న ఇల్లు కాదు డబుల్ బెడ్ రూమ్ లు కట్టిస్తా అని కేసీఆర్ మాట ఇచ్చాడని రఘునందన్ రావు గుర్తు చేస్తూ.. గుజ్జ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంతమందికి కట్టించి ఇచ్చారో మహిళలు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. గ్రామాలలో పేదవారికి ఇల్లులు కట్టించడానికి చెయ్యి రావట్లేదు గాని.. ప్రగతిభవన్  కట్టడానికి 100 కోట్లు ఖర్చు చేసి ఆరు నెలల్లో పూర్తి చేశారని విమర్శించారు. డబల్ బెడ్ రూమ్ ఇల్లులు కట్టడానికి సిమెంటు,  స్టీలు దొరకడం లేదని సాకులు చెబుతున్నారని రఘునందన్ రావు విమర్శించారు. ‘‘ఐదు రోజుల నుంచి కేసీఆర్ బిడ్డను వెంటపెట్టుకుని ఢిల్లీలో ఉంటున్నాడు..  ఢిల్లీలో బిడ్డకు బంగ్లా కట్టిస్తున్నాడు...బిడ్డకు ఢిల్లీలో బంగ్లా కట్టించడానికి స్టీలు, సిమెంటు దొరుకుతుంది కానీ  పేద ప్రజలకు ఇల్లు కట్టించడానికి స్టీలు, సిమెంటు దొరకడం లేదట..’’ అని రఘునందన్ రావు పేర్కొన్నారు. మీ దగ్గరికి వచ్చిన టిఆర్ఎస్ నాయకుల్ని ఎన్ని డబల్ బెడ్ రూమ్ ఇండ్లు  ప్రారంభించారని అడగాలని సూచించారు.

‘‘కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాషాయ జెండా రెపరెపలాడుతోంది..  ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి చేస్తుండని చెప్పడానికి వచ్చాము.. గ్రామాలలో బాత్రూం మాది..  ఎల్ఈడి బల్బు మాది..  చెట్టు మాదే.. చెట్టు చుట్టూ ఉన్న కంచె  మాది..’’ అని రఘునందన్ రావు పేర్కొన్నారు. కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు.