ఆసీస్ గడ్డపై అదరగొడుతున్న తెలుగు కుర్రాడు
ఆస్ట్రేలియాలో పెద్ద బౌండరీ లైన్స్ ఉంటాయి. ఈ వికెట్లపై అశ్విన్, జడేజా ఇద్దరినీ ఆడించాల్సింది. కానీ, కొత్త టీమ్ మేనేజ్‌మెంట్ కొత్త కుర్రాడిని తుది జట్టులోకి తీసుకుంది. తను టాలెంట్ ఉన్న ఆటగాడే కావొచ్చు. కానీ, టెస్టు క్రికెట్‌కు అతను సిద్ధంగా ఉన్నాడా? అన్నదే సందేహం’’
ఈ కుర్రాడు అద్భుతంగా ఆడుతున్నాడు. భారీ షాట్లు కొట్టడంలో తిరుగులేదనిపిస్తోంది. ఆ రివర్స్ స్కూప్... హూక్ షాట్ సిక్స్‌లు సూపర్బ్. తను కచ్చితంగా లాంగ్ టర్మ్ ప్లేయర్‌గా కనిపిస్తున్నాడు’’
ఈ రెండు అభిప్రాయాలు క్రికెట్ లెజెండ్ సునీల్ గావస్కర్‌వి. మొదటిది పెర్త్‌లో ఇండియా–ఆస్ట్రేలియా తొలి టెస్టు సందర్భంగా అయితే.. రెండోది అడిలైడ్‌లో తొలి రోజు ఆట ముగిసిన తర్వాత. ఈ రెండు సందర్భాల్లోనూ సన్నీ ప్రస్తావించిన కుర్రాడు మరెవరో కాదు మన తెలుగోడు నితీశ్ కుమార్ రెడ్డి.
అనూహ్యంగా ఇండియా టెస్టు టీమ్‌లోకి వచ్చి.. అత్యంత కష్టమైన ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసిన 21 ఏండ్ల నితీశ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రెండు టెస్టుల్లోనే తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. అద్భుతమైన టైమింగ్, టెక్నిక్, నిర్భయమైన ఆటతో ఆసీస్ మేటి పేసర్లను అలవోకగా ఎదుర్కొంటున్నాడు. జట్టులో తన ఎంపికను ప్రశ్నించిన గావస్కర్‌తోనే పొగడ్తలు అందుకున్న నితీశ్ రెడ్డి టీమిండియా నయా హీరోగా మారాడు.
డేరింగ్... డాషింగ్
బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల తర్వాత 1–1తో సమంగా నిలిచిన టీమిండియాకు లభించిన ఏకైక సానుకూలాంశం నితీశ్ రెడ్డి అనొచ్చు. ఈ రెండు టెస్టుల్లో ఇండియా నాలుగు సార్లు బ్యాటింగ్ చేస్తే మూడు ఇన్నింగ్స్‌ల్లో తనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పెర్త్ తొలి ఇన్నింగ్స్‌లో, అడిలైడ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో మిగతా బ్యాటర్లు, స్టార్ ప్లేయర్లు తడబడినా నితీశ్ మాత్రం డేరింగ్, డాషింగ్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అడిలైడ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ బంతిని బలంగా కొట్టడం చూసి ఆ టీమ్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ విస్మయం వ్యక్తం చేశాడు.
ఈ సిరీస్‌లో దూకుడైన షాట్లు, బౌండరీ కొట్టే ప్రయత్నాలతో అత్యధిక రన్స్ చేసిన జాబితాలో హెడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ విధంగా అతను 54 బాల్స్‌లో 156 రన్స్ చేశాడు. బాల్‌ను ముందుగానే పిక్ చేసి భారీ షాట్ కొట్టడం హెడ్ స్టయిల్. నితీశ్ రెడ్డి కూడా హెడ్ మాదిరిగా బలమైన స్ట్రోక్స్ కొడుతున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను 163 రన్స్ సాధిస్తే అందులో ఎటాకింగ్ షాట్లు ఆడుతూ 36 బాల్స్‌లో 114 రాబట్టాడు. ఎలాంటి బౌలింగ్‌లో అయినా తను సేచ్ఛగా ఆడుతున్నాడు. కొట్టాల్సిన బాల్ వచ్చినప్పుడు లాగిపెట్టి కొట్టేస్తున్నాడు.
అదే టైమ్‌లో టెక్నిక్, టైమింగ్‌లో ఎలాంటి తేడా రానివ్వకుండా స్టార్ ప్లేయర్‌ను తలపిస్తున్నాడు. పెర్త్ తొలి ఇన్నింగ్స్‌లో వరుసగా వికెట్లు పడుతున్న సమయంలో ఎదురుదాడికి దిగి లైయన్ బౌలింగ్‌లో 8 బాల్స్ తేడాలో డౌన్ ద గ్రౌండ్, కవర్ డ్రైవ్, రివర్స్ స్వీప్ షాట్లతో మూడు ఫోర్లు కొట్టి బౌలర్ ఆత్మరక్షణలో పడేలా చేశాడు. ఇక, పింక్ బాల్ సవాల్‌లో ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, స్కాట్ బోలాంట్ ముందు తోటి ఆటగాళ్లు తేలిపోతే.. నితీశ్ మాత్రం ఎదురు నిలిచాడు.
తొలి ఇన్నింగ్స్‌లో స్టార్క్ ఆఫ్ స్టంప్ పై వేసిన ఫుల్ లెంగ్త్ బాల్‌ను ఎక్స్‌ట్రా కవర్ మీదుగా సిక్స్ కొట్టి ఔరా అనిపించిన రెడ్డి.. బోలాండ్ బౌలింగ్‌లో స్టాన్స్‌ను మార్చుకొని రివర్స్ స్కూప్ షాట్‌తో బాల్‌ను కార్డన్ మీదుగా స్టాండ్స్‌కు పంపిన తీరుకు అంతా విస్మయం వ్యక్తం చేశారు. ఈ సిరీస్‌లో ఇప్పటికి ఈ షాటే హైలైట్ అనొచ్చు. రెండో ఇన్నింగ్స్‌లో కమిన్స్ బౌన్సర్‌ను హుక్ షాట్‌తో సిక్స్ గా మలిచిన నితీశ్ తన వద్ద అన్ని అస్త్రాలూ ఉన్నాయని చాటి చెప్పాడు. ఒక్కోసారి నితీశ్ షాట్లను చూస్తుంటే రిషబ్ పంత్ గుర్తొస్తున్నాడు. పంత్ మాదిరిగా నిర్భయంగా ఆడుతూ.. లోయర్ ఆర్డర్‌లో తానున్నానని జట్టులో భరోసా నింపుతున్నాడు.
గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టాడు
ఈ సిరీస్‌కు నితీశ్ రెడ్డి ఎంపిక నిజంగానే ఆశ్చర్యం. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం నితీశ్‌తో పాటు హర్షిత్ రాణాను పట్టుబట్టి జట్టులోకి తీసుకున్నాడు. ఈ సిరీస్‌కు ముందు నితీశ్ ఫస్ట్‌క్లాస్ అనుభవం 21 మ్యాచ్‌లు మాత్రమే. వీటిలో ఒక సెంచరీ, రెండు ఫిఫ్టీలు మాత్రమే ఉన్నాయి. ఆల్‌రౌండర్‌గా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు రావడంతో ఎక్కువ రన్స్ చేయలేదు. కానీ, ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో ఆంధ్ర టీమ్ తరఫున టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు.
అలవోకగా డబుల్, ట్రిపుల్ సెంచరీలు కొట్టాడు. తన టాలెంట్ గుర్తించిన కోచ్ గంభీర్ బంగ్లాపై టీ20 చాన్స్ ఇవ్వడంతో పాటు బోర్డర్–గావస్కర్ ట్రోఫీకి ముందు ఇండియా–ఎ తరఫున నితీశ్‌ను ముందుగానే ఆసీస్ పంపించాడు. కానీ, ఆసీస్–ఎతో ఆడిన అనధికార టెస్టుల్లో ఆంధ్ర కుర్రాడు నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 0, 17, 16, 38 స్కోర్లు, ఒకే వికెట్ తీసి నిరాశపరిచాడు. అయినా గంభీర్ అతనిపై నమ్మకం ఉంచి రెండు టెస్టుల్లో తుది జట్టులో ఆడించాడు.
గురువు నమ్మకాన్ని నిలబెట్టిన నితీశ్ పెర్త్‌లో ఎనిమిదో నంబర్‌లో, అడిలైడ్‌లో ఏడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 41, 38*, 42, 42 స్కోర్లతో పాటు రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో వికెట్‌తో సత్తా చాటాడు. ఐదో బౌలర్ కావడంతో అతను కొన్ని ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. బుమ్రాపై వర్క్‌లోడ్ పెరుగుతున్న నేపథ్యంలో మిగతా టెస్టులో ఎక్కువ ఓవర్లు వేయిస్తే బౌలర్‌గానూ నితీశ్ నిరూపించుకుంటాడు.
ఎందుకంటే హార్దిక్ పాండ్యా మాదిరిగా తను నిఖార్సైన ఆల్‌రౌండర్. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 25 మ్యాచ్‌ల్లో 56 వికెట్లు పడగొట్టాడు. ఇలాంటి టాలెంట్ ఉన్న ప్లేయర్‌కు కెప్టెన్, కోచ్ మరిన్ని అవకాశాలు ఇచ్చి సానబెడితే టీమిండియాలో అన్ని ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా మారడం పక్కా అనొచ్చు.(వెలుగు స్పోర్ట్స్ డెస్క్)