
భద్రాచలం, వెలుగు: ఇటీవల ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు తెలంగాణ, -ఛత్తీస్గఢ్ బార్డర్లో మంగళవారం హై అలర్ట్ ప్రకటించారు. బంద్ పిలుపుతో మన్యంలో ఆంక్షలు విధించారు. గోదావరి తీరం వెంట నిఘా పెంచారు. దళాల కదలికలను నియంత్రించేందుకు దండకారణ్యంలో కేంద్ర బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తుంగా, యాక్షన్ టీమ్ కట్టడికి భద్రాచలం డివిజన్లోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలు చేపట్టారు.
గోదావరి ఫెర్రీ పాయింట్ల వద్ద నిఘా పెట్టడంతో పాటు రాత్రి పూట మారుమూల ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. భద్రాచలం నుంచి ఏపీలోని మారేడుమిల్లి, సీలేరు, విశాఖ ఘాట్ రూట్లలో వెళ్లే బస్సులను దారి మళ్లించారు. భద్రాచలం నుంచి చింతూరు వెళ్లే బస్సులు, ఆటోలను కూనవరం, బీమవరం మీదుగా పంపిస్తున్నారు. పొలిటికల్ లీడర్లు, ప్రజాప్రతినిధులు, మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు.