- నీళ్లలో ఇండ్లు.. పడవల్లో ప్రయాణం
- నాలుగు రాష్ట్రాల బార్డర్లో వరద బాధితుల కష్టాలు
భద్రాచలం, వెలుగు : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీ రాష్ట్రాల బార్డర్లో జలవిలయంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ నాలుగు రాష్ట్రాల పరిధిలోని దండకారణ్యంలో మంగళవారం వాగులు, ఉప నదులు ఉప్పొంగాయి. పోలవరం బ్యాక్ వాటర్‌కు తోడు, గోదావరి, దాని ఉపనదుల వరద పోటుతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విలీన ఆంధ్రాలోని ఎటపాక, వీఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాల్లో పలు గిరిజన గ్రామాల్లో ఇళ్లు నీటమునిగాయి. దారుల్లేక పడవల్లోనే ప్రయాణం చేస్తున్నారు.
అత్యవసర వైద్యం కోసం
చింతూరు మండలం పెదశీతనపల్లి, తదితర గ్రామాల నుంచి పడవల్లో రోగులను తరలించి చింతూరు ఆస్పత్రి చేర్చారు. కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో శబరి పరివాహక ప్రాంతాల్లో రోడ్లపై చిన్న గుడిసెలు నిర్మించుకుని ఉంటున్నారు. భద్రాచలం నుంచి రాజమండ్రి, విశాఖపట్టట్నం, కూనవరం, చింతూరు, వీఆర్‌పురం, ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి పేరూరు మీదుగా ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లే రోడ్లపైనా నీరు వచ్చి చేరింది. రాకపోకలు స్తంభించాయి.