- వాల్టా, జీఓ 15 ఉల్లంఘించి బోర్ల తవ్వకాలు
- విచ్చలవిడిగా గ్రౌండ్ వాటర్తోడేస్తున్నరు
- సర్కారు ఆదాయానికి కోట్లలో గండి
- టౌన్లలో ఇంటికో బోరున్నా రికార్డుల్లో 27వేలే.. వ్యవసాయ బోర్లూ అందులోనే
- రూల్స్పాటించని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇండస్ట్రీస్
మంచిర్యాల, వెలుగు: వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి బోర్ల తవ్వకాలు జోరుగా సాగుతున్నారు. ఎండాకాలం రావడంతో మంచిర్యాల జిల్లాలోని టౌన్లలో ఎక్కడ చూసినా రిగ్గుల మోతలు వినిపిస్తున్నాయి. వీటిలో ప్రభుత్వ పర్మిషన్లు లేకుండా అక్రమంగా తవ్వుతున్నవే అధికం. ఇష్టారీతిన బోర్లు వేస్తూ గ్రౌండ్ వాటర్‌ను విచ్చలవిడిగా తోడేస్తున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, కమర్షియల్ఎస్టాబ్లిష్మెంట్స్తో పాటు నివాస గృహాల్లోనూ ఇదే పరిస్థితి. నానాటికీ ఇంకిపోతున్న భూగర్భ జలాలను కాపాడేందుకు ఉన్న చట్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదు.
బోర్ల పర్మిషన్లు, వాటర్ యూజర్ చార్జీల రూపంలో ప్రభుత్వం కోట్లలో ఆదాయం కోల్పోతోంది. ప్రస్తుతం గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్లో జిల్లా సేఫ్ జోన్లోనే ఉన్నప్పటికీ.. బోర్ల తవ్వకాలను కంట్రోల్ చేయకపోతే గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కేటగిరీని బట్టి ఫీజులు
వ్యవసాయ బోర్లు, నివాస గృహాలకు రూ.వెయ్యి, అపార్ట్మెంట్లు, హాస్పిటళ్లు, హోటళ్లు, లాడ్జీలు, స్కూళ్లు, కాలేజీలు, వాటర్ ప్లాంట్లు వంటి కమర్షియల్ఎస్టాబ్లిష్మెంట్స్కు రూ.10 వేల ఫీజు చెల్లించాలి. ఇండ్రస్టీస్‌కు కేటగిరీని బట్టి 25 కేఎల్డీ (కిలో లీటర్స్పర్డే)కి రూ.14,500, 25 నుంచి 50 కేఎల్‌డీకి రూ.18వేలు, 50 నుంచి వంద కేఎల్‌డీకి రూ.32వేలు, వందకుపైగా ఉంటే రూ.42వేలుగా ప్రభుత్వం ఫిక్స్చేసింది. కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కు ఐదేండ్లకోసారి రూ.5వేల ఫీజు చెల్లించి ఎన్ఓసీ రెన్యువల్చేసుకోవాలి. ఇండస్ట్రీస్‌కు రూ.10వేల ఫీజుతో మూడేండ్లకోసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండ్లు, వ్యవసాయ బోర్లకు మినహాయింపు ఇచ్చింది.
ఎక్స్ట్రాక్షన్ చార్జీలు ఎగనామం
ఆయా సంస్థలు గ్రౌండ్ వాటర్‌ను వాడుకునే పరిమాణాన్ని బట్టి ప్రభుత్వానికి ఎక్స్ట్రాక్షన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వీటిని సైతం 4 కేటగిరీలుగా విభజించారు. ఒక ఏడాదిలో భూమిలోకి ఇంకిన 100 లీటర్ల నుంచి 70 లీటర్లు తోడుకుంటే సేఫ్‌జోన్, 70 నుంచి 90 లీటర్లకు సెమీ క్రిటికల్, 90 నుంచి 100 లీటర్లకు క్రిటికల్, 100 పైగా అయితే ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్జోన్లుగా పరిగణిస్తారు. ఒక కేఎల్డీ (వెయ్యి లీటర్లు)కి సేఫ్ జోన్లో రూపాయి, సెమీ క్రిటికల్ జోన్లో రూ.2, క్రిటికల్ జోన్లో రూ.4, ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ జోన్లో రూ.6 చొప్పున వసూలు చేస్తారు. రోజుకు 200 కేఎల్డీ దాటితే స్లాబ్ మారుతుంది. ఎక్స్ట్రాక్షన్ చార్జీల కింద సింగరేణి గత ఆరు నెలలకు రూ.1.10 కోట్లు, ఓరియంట్ సిమెంట్ కంపెనీ రూ.14.24 లక్షలు చెల్లించినట్టు గ్రౌండ్ వాటర్ అధికారులు తెలిపారు.
అక్రమ బోర్లు రికార్డుల్లోకి ఎక్కలే..
అక్రమ బోర్లు గవర్నమెంట్ రికార్డుల్లోకి ఎక్కకపోవడం వల్ల ఎవరు ఎన్ని నీళ్లు వాడుకుంటున్నారనే లెక్కలు తెలియడంలేదు. పలు కమర్షియల్ఎస్టాబ్లిష్మెంట్స్, ఇండస్ట్రీస్ ఎక్స్ట్రాక్షన్ చార్జీలకు ఎగనామం పెడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2లక్షలకు పైగా నివాస గృహాలు ఉండగా, మున్సిపాలిటీల్లో ఇంటికో బోరు ఉంది. సింగరేణి వంటి ఇండస్ట్రీస్‌లో వందల సంఖ్యలో ఉన్నాయి. కానీ జిల్లావ్యాప్తంగా వ్యవసాయ బోర్లతో కలిపి 27,516 మాత్రమే రికార్డుల్లో నమోదయ్యాయి. రికార్డుల్లో లేనివి రెంట్టిపు సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. వీటిని సైతం నమోదు చేసేందుకు గ్రౌండ్వాటర్అధికారులు ప్రయత్నిస్తున్నారు.
చట్టం ఉన్నా పర్మిషన్లు లేకుండానే తవ్వకాలు
2002లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వాల్టా చట్టం ప్రకారం నివాస, వ్యవసాయ, కమర్షియల్బోర్ల తవ్వకాలకు పర్మిషన్ తీసుకోవాలి. ఈ రూల్స్‌ను మరింత కఠినతరం చేస్తూ బీఆర్ఎస్ సర్కారు 2023 జూన్‌లో జీఓ ఎంఎస్ నంబర్15ను తీసుకొచ్చింది. దీనిప్రకారం ముందుగా నిర్ణీత రుసుము చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. గ్రౌండ్‌వాటర్ అధికారులు బోర్పాయింట్ను పరిశీలించి ఫీజు బులిటీ రిపోర్ట్, ఎన్ఓసీ ఇస్తారు. దాని ఆధారంగా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు బోర్ల తవ్వకాలకు పర్మిషన్లు జారీ చేస్తారు. కానీ ఈ రూల్స్ఎక్కడా సరిగా అమలు కావడం లేదు.
నోటీసులు జారీ చేస్తున్నాం
వాల్టా, జీఓ నంబర్15 ప్రకారం బోర్లు తవ్వడానికి గ్రౌండ్‌వాటర్ నుంచి ఎన్ఓసీ తోపాటు రెవెన్యూ, మున్సిపల్ డిపార్ట్మెంట్ల నుంచి కూడా పర్మిషన్లు తీసుకోవాలి. కానీ చాలాచోట్ల ఈ రూల్స్ పాటించకుండానే అక్రమంగా బోర్లు వేస్తున్నారు. అలాంటి వాటిని గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నాం. ఇప్పటివరకు జిల్లాలో వంద నోటీసులు అందించాం. అక్రమంగా బోర్లు తవ్వే రిగ్గుల యజమానులకు ఫైన్లు వేస్తున్నాం. రిజిస్ట్రేషన్చేసుకోవాలని కోరుతున్నాం. బోర్లకు పర్మిషన్‌కోసం దరఖాస్తు చేసుకుంటే మా సిబ్బంది వచ్చి బోరు పాయింట్‌ను పరిశీలించి ఫీజు బులిటీ రిపోర్ట్ ఇస్తారు. దాంతో నీళ్లున్న చోటనే బోరు వేసుకోవచ్చు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
- శ్రీనివాస్, గ్రౌండ్ వాటర్ ఇన్చార్జి డీడీ, మంచిర్యాల