జడ్చర్ల ఏరియా ఆసుపత్రిలో శిశువు మృతి

జడ్చర్ల ఏరియా ఆసుపత్రిలో శిశువు మృతి
  • డాక్టర్ల నిర్లక్ష్యం కారణమని బంధువుల ఆరోపణ
  • ఉమ్మ నీరు మింగడంతోనే చనిపోయిందంటున్న డాక్టర్లు

జడ్చర్ల, వెలుగు: మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలోని ఏరియా హాస్పిటల్​లో శిశువు చనిపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే శిశువు చనిపోయిందని బంధువుల ఆరోపిస్తుండగా, ఉమ్మ నీరు మింగడంతోనే ఇలా జరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. జడ్చర్ల మండలం నాగసాల గ్రామానికి చెందిన బోయ చెన్నకేశవులు, కీర్తన భార్యాభర్తలు. కీర్తనను కాన్పు కోసం బుధవారం ఉదయం 11 గంటలకు కుటుంబసభ్యులు జడ్చర్ల ఏరియా హాస్పిటల్​కు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆ టైంలో డెలివరీ చేసేందుకు హాస్పిటల్​లో డాక్టర్లు లేరు. డ్యూటీ డాక్టర్​ మధ్యాహ్నం 2 గంటల తర్వాత వెళ్లిపోయారు. ఈ సమయంలో నర్సులు ఆమెకు నార్మల్​ డెలివరీ చేసే ప్రయత్నం చేశారు.

అప్పటికే ఆలస్యం కావడంతో శిశువు గర్భంలోనే ఉమ్మ నీరు మింగడంతో మగ శిశువు చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయిందని నిరసనకు దిగారు. ఈ విషయంపై స్టాఫ్​ నర్స్​ పద్మను వివరణ కోరగా.. డాక్టర్లు లేకపోవడంతో నార్మల్​ డెలివరీకి ప్రయత్నం చేసినట్లు చెప్పారు. గర్భంలో నీరు తక్కువగా ఉండడంతో నీరు కూడా తాగించామని సమాధానం ఇచ్చారు. డ్యూటీ డాక్టర్​ ప్రశాంతి వివరణ కోరగా.. శిశువు ఉమ్మ నీరు మింగడం వల్లే చనిపోయిందని చెప్పారు.