పాల్వంచలో పసికందు విక్రయం ?

పాల్వంచ,వెలుగు: భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ములకలపల్లి మండలం అల్లిగూడానికి చెందిన ఓ పసికందును విక్రయించిన ట్టు చైల్డ్ లైన్ కు ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన అధికారులు 4 గంటల వ్యవధిలోనే తల్లి ఒడికి చేర్చారు.  పాల్వంచ సీడీపీఓ కనకదుర్గ కథనం ప్రకారం..ములకలపల్లి మండలం అల్లిగూడెంకు చెందిన రమేశ్, లక్ష్మి అనే నిరుపేద  దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఒక పాప ఉన్నారు. ఇంతకుముందే ఒక బాబు చనిపోయాడు. రమేశ్​మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. లక్ష్మి గర్భం దాల్చగా పాల్వంచలోని ఓ ప్రైవేటు హాస్పిటల్​లో గురువారం తెల్లవారుజామున బాబు పుట్టాడు. పోషించే స్థోమత లేకపోవడంతో పాల్వంచకు చెందిన ఓ మహిళకు ఇచ్చేందుకు నిర్ణయించుకుంది. పుట్టిన రెండు గంటల్లోనే లక్ష్మి అక్క రాజ్యలక్ష్మి , మరికొందరు వ్యక్తులతో కలిసి బాబును మహిళకు ఇచ్చేందుకు తీసుకుని వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న  చైల్డ్ లైన్ అధికారులు పాల్వంచ సీడీపీఓ కనకదుర్గకు సమాచారమిచ్చారు. ఆమె హాస్పిటల్​కు వచ్చి మాట్లాడగా లక్ష్మి, ఆమె తల్లి  విషయం దాట వేశారు. సీసీ ఫుటేజీలు పరిశీలించగా నలుగురు ఆటోలో వచ్చి బాబును తీసుకువెళ్లినట్టు గుర్తించారు. వెంటనే టౌన్ పోలీసులకు చెప్పడంతో టౌన్​ ఎస్​ఐ నరేశ్, అడిషనల్ ఎస్సై ప్రవీణ్ కుమార్ నాలుగు గంటల వ్యవధిలోనే బాబును తల్లి ఒడికి చేర్చారు. తల్లి పాలిచ్చే పరిస్థితి లేకపోవడంతో తాగించడానికి తీసుకువెళ్లానని అక్క రాజ్యలక్ష్మి చెబుతోంది. మరో వైపు లక్ష్మికి తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో విచారణ వల్ల ఆమె ఒత్తిడికి లోనైతే ప్రమాదకరమని భావించిన పోలీసులు ప్రస్తుతానికి విచారణ వాయిదా వేశారు.  చైల్డ్ లైన్ అధికారులు మాత్రం ఎంక్వైరీ చేస్తున్నారు.