అప్పుడే పుట్టిన శిశువును స్మశానంలో వదిలిన వ్యక్తులు

అప్పుడే పుట్టిన శిశువును స్మశానంలో వదిలిన వ్యక్తులు
  • కొత్తగూడెం పట్టణంలోని న్యూగొల్లగూడెంలో ఘటన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అప్పుడే పుట్టిన మగబిడ్డను కొందరు వ్యక్తులు స్మశానంలో వదిలివెళ్లారు. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలోని న్యూ గొల్లగూడెంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గురువారం ఉదయం ఆరు గంటల టైంలో గొల్లగూడెంలోని స్మశానవాటిక నుంచి ఓ చిన్నారి ఏడుపు వినిపించడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. శిశువును గుర్తించి స్థానిక కౌన్సిలర్‌‌ మాచర్ల రాజకుమారి శ్రీనివాస్‌‌ దృష్టికి తీసుకొచ్చారు. 

శ్రీనివాస్‌‌ పోలీసులు, వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చి వారి సాయంతో చిన్నారిని రామవరంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే న్యూగొల్లగూడెంనకే చెందిన ఓ యువతికే శిశువు జన్మించాడని, ఆమె తండ్రే చిన్నారిని స్మశానంలో వదిలి వెళ్లాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు యువతిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.