![కమిటీలల్ల తెలుగుదేశపోళ్లను పెడ్తే ఊకుంటమా : దామోదర రాజనర్సింహ](https://static.v6velugu.com/uploads/2022/12/Damodara-Raja-Narsimha_sZELbDl53t.jpg)
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, పరిణామాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నేత దామోదర రాజ నర్సింహ్మ అన్నారు. అందరితో మమేకమవుతూ.. కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే దిశగా తమ ప్రయత్నం ఉంటుందని చెప్పారు. పార్టీని బలోపేతం చేసే దిశగా తాము ఎప్పుడూ ప్రయత్నం చేస్తామన్నారు. మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు సోషల్ మీడియాలో తమను తప్పు పడుతున్నారని చెప్పారు. నాలుగు పార్టీల్లో తిరిగి వచ్చిన చరిత్ర తమది కాదన్న దామోదర రాజ నర్సింహ్మ... కాంగ్రెస్ లో పుట్టినం.. కాంగ్రెస్ లో పెరిగినం.. కాంగ్రెస్ లోనే చస్తాం అని తెలిపారు. కాంగ్రెస్ లో ఉంటూ పార్టీ కార్యకర్తలకు ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే.. వారిని కాపాడే దిశగా తమ ప్రయత్నం చేస్తామని వివరించారు.
క్యారెక్టర్ లేనివాళ్లు పార్టీని నడిపిస్తున్నారు
కుట్రపూరితంగా పార్టీని నాశనం చేసే ప్రయత్నం జరుగుతోందని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ అన్నారు. క్యారెక్టర్ లేనివాళ్లు పార్టీని నడిపిస్తున్నారని, తమను ప్రశ్నించే స్థాయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస వచ్చినోళ్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ రోజు పంచాయతీ వచ్చిందన్నారు. ఇదంతా పార్టీని నాశనం చేసే ప్రయత్నమేనని ఆరోపించారు. సీఎల్పీ నేతను విస్మరించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదన్న మధుయాష్కీ.. అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని వాపోయారు.