ప్రస్తుత కాలంలో ఉద్యోగంలో ఆటుపోట్లు తప్పవు. అయితే చేస్తున్న పనికి గుర్తింపు దక్కకపోతే మాత్రం ఏ ఉద్యోగి అయినా పనితనంలో దూకుడు పెంచలేరు. అందుకే చాలా కంపెనీలు ప్రతి యేటా ‘బెస్ట్ ఎంప్లాయ్’ అవార్డును ఇస్తుంటారు. ఈ తరహాలోనే కేరళకు చెందిన ఓ కంపెనీ తమ ఉద్యోగికి కళ్లు చెదిరే గిఫ్ట్ ఇచ్చింది. వివరాలలోకి వెళ్తే.. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మరియు గృహోపకరణాల రిటైల్ కంపెనీ ‘మైజీ’లో అనీష్ అనే వ్యక్తి గత 22 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అనీష్ కంపెనీలో మార్కెటింగ్, నిర్వహణ మరియు వ్యాపార అభివృద్ధి విభాగాలతో సహా పలు హోదాలలో పనిచేశారు. ఆయన ప్రస్తుతం చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. నమ్మకంగా పనిచేస్తున్న అనీష్ పనితనాన్ని.. కంపెనీ యజమాని షాజీ గుర్తించారు. దాంతో అనీష్‌కి విలువైన కారును బహుమతిగా అందించాడు. సుమారు ₹ 45 లక్షల విలువైన బ్రాండ్ న్యూ బెంజ్ జీఎల్ఏ క్లాస్ 220డీ ఎస్‌యూవీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయాన్ని కంపెనీ ఓనర్ షాజీ తన ఇన్స్టా పేజీలో పంచుకున్నాడు.
‘నేను కంపెనీ ప్రారంభించకముందు నుంచి కూడా అనీష్ నాతో ఉన్నాడు. అతను నాకు, నా కంపెనీకి మూలస్థంభం. ఆయన నన్ను ఎప్పుడూ నిరాశపరచలేదు. అనీష్ సోదర ఆప్యాయత మరియు పని పట్ల ఆయనకున్న అంకితభావం నాకు చాలా మద్దతు ఇచ్చాయి. నేను అనీష్‌ని ఉద్యోగిగా కాకుండా భాగస్వామిగా భావిస్తాను’ అని షాజీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.
కంపెనీ యజమాని తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని అనీష్ తెలిపాడు. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తారని అస్సలు ఊహించలేదని అనీష్ అన్నాడు.
కాగా.. మైజీ కంపెనీ యజమాని షాజీ తన ఉద్యోగులకు గిఫ్టులు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఆయన గతంలో కూడా చాలా మంది ఉద్యోగులకు బహుమతులు ఇచ్చాడు. రెండేళ్ల క్రితం ఆరుగురు ఉద్యోగులకు ఆరు కార్లను అందచేసి.. ఆశ్చర్యపడేలా చేశాడు. అంతేకాకుండా.. మరికొంతమందికి విదేశీ పర్యటనలు కూడా ఏర్పాటుచేసి వారి కలను తీర్చాడు.
For More News..