
- బడ్జెట్‌తోపాటు వక్ఫ్ సవరణ బిల్లుపై హాట్‌హాట్‌గా సాగిన చర్చలు
- ఓవరాల్‌గా సభ ప్రొడక్టివ్గాసాగినట్టు కిరణ్ రిజిజు ప్రకటన
న్యూఢిల్లీ: పార్లమెంట్బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. రాజ్యసభ, లోక్ సభ శుక్రవారం (April 4) నిరవధికంగా వాయిదా పడ్డాయి. జనవరి 31 నుంచి రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. తొలి దశ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు, రెండో దశ మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు సాగింది. ఈ సమావేశాల్లో మొత్తం 16 బిల్లులను ఆమోదించినట్లు స్పీకర్ తెలిపారు.
శుక్రవారం ఉదయం లోక్ సభ ప్రారంభం కాగానే.. వక్ఫ్(సవరణ) బిల్లు- 2025తో సమాజంలో శాశ్వత విభజనను తీసుకొచ్చేందుకు బీజేపీ యత్నిస్తున్నదంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన విమర్శలపై అధికారపక్షం ఆందోళన చేసింది. సోనియాగాంధీ క్షమాపణలు చెప్పాలని ఎన్డీయే పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో సభ వాయిదాపడింది. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభమైన తర్వాత, ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది.
ప్రతిపక్షనేత రాహుల్ గాంధీని సభలో మాట్లాడనివ్వకుండా వివక్ష చూపించారంటూ నినాదాలు చేశారు. ఎలాంటి చర్చ చేపట్టకుండానే బలవంతంగా వక్ఫ్ బిల్లుకు ఆమోదం తెలిపారని విమర్శించారు. దీంతో స్పీకర్ బిర్లా తన ముగింపు ప్రసంగాన్ని చదివి, సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సమావేశాల్లో సభ ప్రొడక్టివిటీ 118 శాతం కంటే ఎక్కువ ఉందని తెలిపారు. రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్ బడ్జెట్ కూడా క్లియర్ అయిందని తెలిపారు.
సుదీర్ఘ సమయం సభ నడిపాం: ధన్‌ఖడ్
రాజ్యసభ కూడా శుక్రవారం రెండుసార్లు వాయిదా పడింది. చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆపై మళ్లీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాయిదా వేశారు. అనంతరం ఆయన బడ్జెట్ సమావేశాలపై ప్రసంగించారు. ఈ సెషన్లో వక్ఫ్ (సవరణ) బిల్లుతోపాటు పలు కీలక అంశాలపై చర్చించినట్టు ధన్‌ఖడ్ తెలిపారు. సభ ప్రొడక్టివిటీ 119 శాతంగా ఉన్నట్టు చెప్పారు.
గురువారం ఉదయం (ఏప్రిల్ 3) ఉదయం 11 గంటల నుంచి శుక్రవారం వేకువజామున 4.02 గంటల వరకు సభను నిర్వహించామని, రాజ్యసభ చరిత్రలోనే ఇంత సుదీర్ఘ సమయం సభ నడవడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
రెండు సభల్లో 100% ఉత్పాదకత: కిరణ్ రిజిజు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. రెండు సభల్లో నాణ్యమైన చర్చలు జరిగాయని, 100% ఉత్పాదకత సాధించామని చెప్పారు. లోక్‌సభలో 118%, రాజ్యసభలో 119% ప్రొడక్టివిటీ సాధించినట్టు వివరించారు.