పార్లమెంట్‎లో కొనసాగుతోన్న అదానీ రగడ.. ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్‎లో కొనసాగుతోన్న అదానీ రగడ.. ఉభయ సభలు వాయిదా

న్యూఢిల్లీ: అదానీ లంచం ఆరోపణలపై విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం (డిసెంబర్ 6) పార్లమెంట్ బిల్డింగ్ ముందు కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. రాజ్యాంగ ప్రతులను చేతిలో పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసనల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. అదానీ- మోడీ భాయ్ భాయ్ అంటూ ముఖానికి మాస్కులు ధరించి నిరసన తెలిపారు.

బిలియనీర్ గౌతమ్ అదానీ ఇష్యూపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదానీ ముడుపుల వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని నినాదాలు చేశారు. అంతకుముందు ముందు డా. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి  సందర్భంగా పార్లమెంట్‎లోని అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. 

సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే అదానీ ఇష్యూపై జేపీసీ ఏర్పాటు చేసి.. కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అదానీ ముడుపుల వ్యవహారంపై  సభలో చర్చ నిర్వహించాలని ప్రతి పక్ష పార్టీల ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. విపక్షాల వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. 

దీంతో ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. స్పీకర్ సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రతి పక్షాలు వెనక్కి తగ్గలేదు. విపక్ష ఎంపీల ఆందోళనతో సభలో గందరగోళం నెలకొనడంతో పార్లమెంట్ సభలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై 10 రోజు కావొస్తోన్న విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి.