న్యూఢిల్లీ: ప్రతిపక్షాల నినాదాలు, ఆందోళనతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండో రోజు (నవంబర్ 27) ప్రారంభం కాగానే.. అదానీపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు, మణిపూర్ అల్లర్లు, రాజ్యాంగంపై చర్చ జరపాలని లోక్ సభలో ప్రతిపక్షలు పట్టుబట్టాయి. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అదానీ లంచం ఆరోపణలపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లోక్ సభ స్పీకర్‌కు వాయిదా తీర్మానం ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ గౌతమ్ అదానీపై చర్చకు డిమాండ్ చేశారు.
మరో వైపు కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు.. శాంతిభద్రతలపై చర్చించడానికి లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలను స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. దీంతో ప్రతిపక్ష నేతలు ఆందోళనకు దిగారు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో లోక్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 12 గంటల తర్వాత మళ్లీ సభ ప్రారంభం కాగా.. అదానీ ఇష్యూపై చర్చకు విపక్షాలు పట్టబట్టాయి. విపక్షాల నినాదాలు, ఆందోళనతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ లోక్ సభను రేపటికి (నవంబర్ 28) వాయిదా వేశారు.
ALSO READ : అవన్నీ ఫేక్.. యూఎస్ కేసులపై క్లారిటీ ఇచ్చిన అదానీ గ్రూప్
రాజ్య సభలోనూ సేమ్ ఇదే విధంగా జరిగింది. అదానీ లంచం ఆరోపణలు, మణిపూర్ అల్లర్లపై చర్చ నిర్వహించాలని రాజ్య సభ చైర్మన్‌కు ప్రతిపక్షాలు వాయిదా తీర్మానం ఇచ్చారు. అపొజిషన్ నేతల వాయిదా తీర్మానాన్ని చైర్మన్ రిజెక్ట్ చేయడంతో వారు ఆందోళనకు దిగారు. దీంతో చైర్మన్ రాజ్య సభను రేపటికి (నవంబర్ 28) వాయిదా వేశారు. మొత్తానికి అదానీ లంచం ఆరోపణలు అంశం రెండో రోజు కూడా పార్లమెంట్‌ను కుదిపేసింది. దీంతో ఎలాంటి చర్చ జరగకుండానే రెండో రోజు కూడా ఉభయ సభలు వాయిదా పడ్డాయి.