ఐదో రోజు సేమ్ సీన్: పార్లమెంట్ ఉభయ సభలు డిసెంబర్ 3కి వాయిదా

ఐదో రోజు సేమ్ సీన్: పార్లమెంట్ ఉభయ సభలు డిసెంబర్ 3కి వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్‎లో ఐదో రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఐదో రోజు (2024, డిసెంబర్ 2) సభ కార్యాకలాపాలు మొదలు కాగానే.. అదానీ లంచం ఆరోపణలు, సంభాల్ ఇష్యూ, తమిళనాడు వరదలు, బంగ్లాదేశ్‎లో హిందువులపై దాడులు, అజ్మీర్ షరీఫ్ దర్గా అంశంపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఈ మేరకు ఉభయ సభల్లో ప్రతిపక్ష ఎంపీలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు.

 అమెరికాలో అందానీ లంచం ఆరోపణలపై చర్చ జరపాలని కాంగ్రెస్ ఎంపీ  మాణిక్కం ఠాగూర్ లోక్ సభ స్పీకర్‎కు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని విల్లుపురం, కడలూరు, చెంగల్‌పట్టు, పుదుచ్చేరి జిల్లాల్లో మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు, భారీ వరదల కారణంగా నిలిచిన పంటలు, ఆస్తుల నష్టంపై చర్చించాలని డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

Also Read :- మాలల ఆత్మ గౌరవం, ఐక్యతను చాటి చెప్పాం

 బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన అకృత్యాలు, చిన్మోయ్ కృష్ణ దాస్‌తో సహా ముగ్గురు ఇస్కాన్ సన్యాసుల అరెస్టుపై చర్చకు పట్టబుడుతూ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో బిజినెస్ నోటీస్ ప్రవేశపెట్టారు. సంభాల్ హింసాకాండ, అజ్మీర్ షరీఫ్ దర్గా అంశంపై చర్చ కోరుతూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి రాజ్యసభ చైర్మన్‎కు వాయిదా తీర్మానం ఇచ్చారు. ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలను రాజ్య సభ చైర్మన్, లోక్ సభ స్పీకర్ తిరస్కరించారు. 

దీంతో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. అదానీ, సంభాల్ ఇష్యూపై చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీకి వ్యరేతికంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ్యులను కంట్రోల్ చేసేందుకు స్పీకర్ ప్రయత్నించినప్పటికీ సభ ఆర్డర్‎లో లేకపోవడంతో పార్లమెంట్ఉభయ సభలు వాయిదా పడ్డాయి. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సభ కార్యకలాపాలు ప్రారంభం కాగా.. మళ్లీ విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలను 2024, డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేశారు.