కాజీపేట/తొర్రూరు, వెలుగు: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల రిక్రూట్ మెంట్ కమ్ అడ్మిషన్ ల కోసం నిర్వహించే ‘గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)’ 2022 పరీక్షలో మన స్టూడెంట్లు ఇద్దరికి ఆలిండియా 1, 9వ ర్యాంకులు వచ్చాయి. వరంగల్ నిట్ విద్యార్థి టి. మణి సందీప్ రెడ్డి గేట్ 2022లో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించినట్లు నిట్ అధికారులు తెలిపారు. హైదరాబాద్కు చెందిన మణి సందీప్ వరంగల్ నిట్లో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతని తండ్రి హైదరాబాద్ లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు, కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ హెచ్వోడీ డా. శ్రీనాథ్, ప్రొఫెసర్ శిరీశ్ సోన్వానే, నిట్ ప్రొఫెసర్లు మణి సందీప్ రెడ్డిని అభినందించారు. అలాగే, గేట్2022 ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన తన్నీరు నిరంజన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆలిండియా స్థాయిలో 9వ ర్యాంకు సాధించాడు. నిరంజన్ తండ్రి శ్రీనివాస్ ప్రైవేట్ లెక్చరర్ కాగా, తల్లి నిర్మల తొర్రూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పని చేస్తున్నారు. నిరంజన్ మహారాష్ట్రలోని రూర్కీ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. గేట్ 2022 ఫలితాలను ఐఐటీ ఖరగ్ పూర్ గురువారం విడుదల చేసింది. ఫలితాలు ఐఐటీ ఖరగ్ పూర్ వెబ్ సైట్ (https://gate.iitkgp.ac.in./)లో అందుబాటులో ఉన్నాయి. స్కోర్ కార్డులు ఈ నెల 21 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీని కూడా వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు అప్లికేషన్ పోర్టల్ లోకి లాగిన్ అయ్యి గేట్ ఆన్సర్ కీని డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.