గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో మళ్లీ ఆ ఇద్దరికే చాన్స్!

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో మళ్లీ ఆ ఇద్దరికే చాన్స్!
  • కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్​కు సిఫారసు చేయనున్న కేబినెట్

హైదరాబాద్, వెలుగు: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ దృష్టి పెట్టారు. గతంలో ఈ రెండు స్థానాలకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో పాటు మైనార్టీ కోటా కింద ఉర్దూ పత్రిక ఎడిటర్ అమీర్ అలీఖాన్ పేర్లను రాష్ట్ర కేబినెట్ గవర్నర్ కు సిఫారసు చేసింది. అయితే, దీనిపై బీఆర్ఎస్ నేతలు కోర్టుకు వెళ్లడంతో.. మళ్లీ కొత్తగా ఇద్దరి పేర్లతో కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కు పంపించుకోవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. 

దీంతో దాదాపు ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్న ఈ రెండు ఎమ్మెల్సీ పదవుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. ఈ రెండింటికి మళ్లీ ఆ ఇద్దరి పేర్లనే కేబినెట్ సిఫారసు చేస్తుందని.. కోదండరాం, అమీర్ అలీఖాన్​ను కాదని వేరే వారికి చాన్స్​ ఇచ్చే పరిస్థితి లేదని పీసీసీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కేబినెట్ మీటింగ్ ఉండడం, దీనికి ఒకరోజు ముందే రాష్ట్రానికి కొత్త గవర్నర్ రావడంతో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై  మళ్లీ చర్చ ప్రారంభమైంది. 

గురువారం నాటి కేబినెట్ మీటింగ్ లో దీనిపై తీర్మానం చేస్తారా? లేక ఆ తర్వాత జరగనున్న కేబినెట్ మీటింగ్ లో తీర్మానం చేస్తారా? అనేదానిపై ఇప్పుడు చర్చ సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు బుధవారం కోదండరాం అసెంబ్లీకి రావడంతో ఎమ్మెల్సీల భర్తీ విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే, ఆగస్టు 2న ఎల్బీ స్టేడియంలో జరగనున్న టీచర్ల సభ కు రేవంత్​ను ఆహ్వానించేందుకు కోదండరాం వచ్చినట్టు సీఎం సన్నిహితులు చెప్తున్నారు.