- రేవంత్‍రెడ్డి కేబినెట్లో సీతక్క, సురేఖకు సముచిత స్థానం
- సీతక్కకు ట్రైబల్ వెల్ఫేర్, సురేఖకు విమెన్ వెల్ఫేర్ శాఖలు ఇచ్చారంటూ ప్రచారం
- ఇద్దరికీ మావోయిస్టు పార్టీతో అనుబంధం
- ఒకరు ఆదివాసీ.. మరొకరు బీసీ!
వరంగల్/భూపాలపల్లి, వెలుగు : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ కూర్పులో ఓరుగల్లుకు సముచిత స్థానం లభించింది. గురువారం సీఎం రేవంత్‍రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రివర్గంలో 11 మందికి అవకాశమివ్వగా..అందులో ఇద్దరు మహిళా మంత్రులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారే కావడం విశేషం. కాగా, వీరిద్దరి పోర్ట్ ఫోలియోలు ఫైనల్ చేయలేదు. ములుగు జిల్లాకు చెందిన ధనసరి అనసూయకు (సీతక్క) ట్రైబల్ వెల్ఫేర్, వరంగల్‌కు చెందిన కొండా సురేఖకు ఉమెన్ అండ్ చైల్డ్వెల్ఫేర్ శాఖలు ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. సురేఖ గతంలో మంత్రిగా పని చేయగా, సీతక్కను మొదటిసారి మినిస్టర్ పదవి వరించింది.
ఆదివాసీ బిడ్డగా సముచిత స్థానం
ములుగు జిల్లా నియోజకవర్గ కేంద్రం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సీతక్కకు ఆదివాసీ బిడ్డగా పార్టీలో, బయట ప్రత్యేక గుర్తింపు ఉంది. ధనసరి అనసూయగా నక్సలైట్లలోకి వెళ్లి సీతక్కగా మారి ఎక్కువ కాలం అక్కడే పని చేశారు. సహచరుడినే పెండ్లి చేసుకున్నారు. వనం వదిలి జనారణ్యంలోకి వచ్చిన ఆమె ప్రజాసేవ కోసం రాజకీయాల వైపు మళ్లారు. ఓసారి టీడీపీ నుంచి మరోసారి కాంగ్రెస్ నుంచి గెలిచిన సీతక్క జనం గొంతుకగా నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఆమె అంటే ప్రత్యేక గౌరవం ఉంది. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2017లో టీడీపీ నుంచి రేవంత్‌రెడ్డితో పాటు సీతక్క కాంగ్రెస్‌లో చేరారు. నాటి నుంచి ఆయన వెంటే నడిచారు. ఈసారి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరగడంతో గెలుపును సవాల్‌గా తీసుకున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బడే నాగజ్యోతికి టికెట్ కేటాయించి గెలుపు కోసం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పింది. అయినా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సీతక్కకే నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్ సర్కార్ వస్తే సీతక్కకు సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్‍రెడ్డి ప్రకటించినట్టుగానే ఆమెకు మంత్రి పదవి ఇచ్చి సత్కరించారు.
ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్‍గా.. కొండా సురేఖ
కొండా సురేఖకు ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్‍గా పేరుంది. 20 ఏండ్ల క్రితం ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ మద్దతుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సురేఖ జనాలకు ఇంటి మనిషి అయ్యారు. కొండా మురళిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 1995లో గీసుగొండ ఎంపీపీగా మొదలైన ఆమె ప్రస్థానం శాయంపేట, పరకాల, వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచే వరకూ వచ్చింది. వైఎస్.రాజశేఖర్‍రెడ్డి హయంలో కొన్ని నెలలు మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్‍రావుతో ఎప్పటినుంచో వైరం కొనసాగుతోంది. ఆ కారణంతో ఎర్రబెల్లి ఉన్న టీడీపీని కాకుండా కాంగ్రెస్‍ను ఎంచుకున్నారు. కొండా ఫ్యామిలీకి మొదటి నుంచి ఆర్‍కే, భారతక్క వంటి దళ కమాండర్లతో దగ్గరి పరిచయం ఉండేది. దీంతో పలుమార్లు పోలీసు కేసులతో పాటు ఇతరత్రా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. వైఎస్ మరణం, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి బీఆర్‍ఎస్‍లో చేరారు. తీరా అదే పార్టీలో ఎర్రబెల్లి చేరడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సురేఖను మంత్రి పదవితో మరోసారి గౌరవించినట్లయింది.
జిల్లాకు రెండు పాత శాఖలే..
వైఎస్ రాజశేఖర్‍రెడ్డి ప్రభుత్వంలో కొండా సురేఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగారు. ఇప్పుడు రేవంత్‍రెడ్డి మంత్రి వర్గంలోనూ అదే శాఖ కేటాయించారని చెబుతున్నారు. సీతక్క మొదటిసారి మంత్రి కాగా, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ చూసిన గిరిజానాభివృద్ధి సంక్షేమ శాఖను మరోసారి ఆమెకు కట్టబెట్టినట్ట సమాచారం. గత ప్రభుత్వంలో ఇవే శాఖలను ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి గెలిచిన వారే నిర్వహించడం గమనార్హం.