టీడీపీ, జనసేన పార్టీలకు చావుదెబ్బ తగిలింది.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై బొత్స రియాక్షన్

టీడీపీ, జనసేన పార్టీలకు చావుదెబ్బ తగిలింది.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై బొత్స రియాక్షన్

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ, జనసేనకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చిన ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ ఓటమి పాలయ్యారు. బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్థి గాదె శ్రీనివాసులు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన మద్దతు తెలిపిన అభ్యర్థి ఓటమి పాలుకావడంతో శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు. ఈ మేరకు సోమవారం (మార్చి 3) ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ, జనసేన కూటమి పార్టీలకు చావుదెబ్బ తగిలిందని అన్నారు. ఎల్లవేళలా మోసం పనిచేయదని తేలిపోయిందని.. అధికారం ఉందనే అహంకారంతో అరాచకాలు చేస్తున్న టీడీపీ, జనసేన సహా కూటమి పార్టీలకు విజ్ఞులైన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు గట్టి గుణపాఠం చెప్పారన్నారు. ప్రజాస్వామ్య విలువలను మరోసారి చాటిచెప్పారని అన్నారు.  

ఎన్నికల్లో హామీలిచ్చి ఓట్లేయించుకుని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా నిలువునా మోసం చేసింద ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేసిన మోసాలను తిప్పికొడుతూ ఇవాళ గట్టి తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విశాఖపట్నం.. మూడు జిల్లాల నుంచి టీచర్లు పాల్గొన్న తీరు, వచ్చిన ఫలితం.. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో తేటతెల్లం అయిందన్నారు.