నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్

  • అకౌంట్ లో చాలినన్ని ఫండ్స్ లేవని బాధితులకు మెసేజ్
  • చెక్ బౌన్స్ తో వారికి రూ.300 చొప్పున ఫైన్
  • నేడు మధ్యాహ్నంలోగా డబ్బులు జమవుతాయని తహసీల్దార్  క్లారిటీ

యాదగిరిగుట్ట, వెలుగు:  ప్రభుత్వం సేకరించిన భూముల నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్  అయ్యాయి. ఈ సంఘటన మంగళవారం యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో జరిగింది. తుర్కపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 72లో 42 మంది పేదలకు అప్పట్లో ప్రభుత్వం 58 ఎకరాల భూమిని అసైన్  చేసింది. తుర్కపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న గ్రీన్  ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ కింద ఆ 58 ఎకరాల భూమితో కలిపి మొత్తం 93.21 ఎకరాల భూమిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. నష్టపరిహారం కింద ఒక్కో ఎకరానికి రూ.17.50 లక్షల చొప్పున మొత్తం రూ.16.64 కోట్లు విడుదల చేసింది. భూములు కోల్పోయిన బాధితులకు పరిహారానికి సంబంధించిన చెక్కులను ఈనెల 12న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పంపిణీ చేశారు. ఆ చెక్కులను బాధితులు తమ బ్యాంక్ అకౌంట్లలో జమచేసుకున్నారు. అయితే, చాలినన్ని ఫండ్స్ లేకపోవడంతో ఆ  చెక్కులు బౌన్స్  అయ్యాయని బాధితులకు మంగళవారం మెసేజీలు వచ్చాయి. దీంతో బ్యాంకుకు వెళ్లి అడగగా.. ప్రభుత్వం ఇచ్చిన చెక్కులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో సరిపడా ఫండ్స్ లేవని, అందువల్లే చెక్కులు రిటర్న్ వచ్చాయని బ్యాంక్  మేనేజర్  బదులిచ్చినట్లు బాధితులు చెప్పారు.

టెక్నికల్ ప్రాబ్లంతో సమస్య

భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన విషయం గురించి తుర్కపల్లి తహసీల్దార్  దేశా నాయక్ ను అడగగా.. చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇలాంటి సమస్య తలెత్తిందని, చెక్కులు బౌన్స్ కాలేదని చెప్పారు. ‘‘భువనగిరి ఆర్డీవో, టీఎస్ఐఐసీ యాదాద్రి జోన్  జోనల్ మేనేజర్  జాయింట్ అకౌంట్ (యాక్సిస్ బ్యాంక్, నల్గొండ) కు సంబంధించిన చెక్కులను బాధితులకు ప్రభుత్వం ఇచ్చింది. అయితే బాధితులకు సంబంధించిన డబ్బులను టీఎస్ఐఐసీ మెయిన్ అకౌంట్ నుంచి ఆర్డీవో, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ జాయింట్ అకౌంట్లోకి బదిలీ చేయకపోవడంతో బాధితులు డిపాజిట్  చేసిన చెక్కులు రిటర్న్ అయినట్లు బ్యాంకు నుంచి మెసేజీలు వచ్చాయి” అని తహసీల్దార్  చెప్పారు. బుధవారం మధ్యాహ్నంలోపు బాధితుల బ్యాంక్  అకౌంట్లలో డబ్బులు జమవుతాయని దేశా నాయక్ వెల్లడించారు.

చెక్కు రిటర్న్ వచ్చింది

తుర్కపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం నాకు సంబంధించిన 4.20 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంది. ఎకరానికి రూ.17.50 లక్షల చొప్పున మొత్తం రూ.78. 75 లక్షలకు సంబంధించిన చెక్కును ఈనెల 12న ఎమ్మెల్యే గొంగిడి సునీత అందజేశారు. ఈ చెక్కును ఈనెల 16న బ్యాంకులో డిపాజిట్ చేయగా.. సరిపోను ఫండ్స్ లేకపోవడంతో చెక్కు రిటర్న్ వచ్చినట్లు బ్యాంకు నుంచి నాకు మెసేజ్ వచ్చింది. 18న బ్యాంకుకు వెళ్లి మేనేజర్ ను అడగగా.. అదే సమాధానం ఇచ్చారు. చెక్ బౌన్స్ కావడంతో నాకు రూ.300 ఫైన్  పడింది.

- పుట్ట లక్ష్మి, బాధితురాలు