- బ్యాంక్ అకౌంట్లలో నగదు లేకున్నా చెక్కులు ఇస్తున్న జనం
- గతేడాది రూ. 300 కోట్ల ఆదాయం పెండింగ్
- ఈ ఏడాది నుంచి బంద్ పెట్టాలనే యోచన
హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీకి పన్నుల రూపేణా చెక్కులు ఇస్తుండగా బౌన్స్ అవుతున్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ వంటి పన్నులకు కొందరు చెల్లింపుల కింద చెక్కులు ఇస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ అధికారుల ఒత్తిడి తట్టుకోలేక కొందరు పన్ను చెల్లింపుదారులు అడ్వాన్స్ డేట్ లు వేసి చెక్కులను అందిస్తున్నారు. వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుండగా, ఖాతాల్లో డబ్బుల్లేక బౌన్స్ అవుతున్న పరిస్థితి ఉంది. ఓ వైపు పన్ను వసూళ్లపైనే కాకుండా.. మరోవైపు బౌన్స్ అయ్యే చెక్కులపైనా అధికారులు దృష్టి పెడుతుండగా పనిభారం పెరిగిపోతోంది.
బౌన్స్ అయిన చెక్కులపై సంబంధిత ఓనర్లకు నోటీసులతోనే అధికారులు సరిపెడుతున్నారు. గతేడాది ఆస్తి పన్ను రూ.1,915 కోట్లు వసూలైంది. ట్రేడ్ లైసెన్స్ ఫీజుగా మరో రూ.50 కోట్ల వరకు బల్దియా ఖజానాకు సమకూరింది. కాగా.. బిల్ కలెక్టర్ల ద్వారా వసూలైన రూ.860 కోట్ల పన్నులో 40 శాతం వరకు చెక్కుల రూపేణా చెల్లించారు. మిగతా మొత్తం ఆన్ లైన్, సీఎస్సీ తదితర సెంటర్ల ద్వారా కలెక్ట్ అయింది. పన్ను చెల్లింపులో చెక్కుల చిక్కులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని బల్దియా
నిర్ణయించింది.
ప్రతి ఏటా రూ.300 కోట్లు పెండింగ్
గ్రేటర్ సిటీలో18లక్షలకు పైగా ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఉండగా.. రూ.2,100 కోట్ల వరకు ట్యాక్స్ డిమాండ్ ఉంటుంది. పన్నుల చెల్లింపుల్లో వచ్చే చెక్కులు భారీగా బౌన్స్ అవుతుండగా బల్దియాను ఆందోళనకు గురిచేస్తుంది. ప్రతి ఏటా చెక్కుల రూపేణా రూ.200 నుంచి రూ.300 కోట్ల దాకా ఆదాయం వస్తుంది. చెక్కులు బౌన్స్ అవుతుండగా.. ఆ డబ్బును వినియోగించుకునే చాన్స్ లేకుండా పోతోంది.
సరైన టైంలో ఖజానాలోకి రాకపోగా, మళ్లీ పన్ను చెల్లింపుదారుల చుట్టూ తిరుగుతుండడం అధికారులకు ఇబ్బందిగా తయారైంది. పదేండ్ల కింద చెక్కులు ఇస్తే డిప్యూటీ కమిషనర్లు, ఫైనాన్స్ సెక్షన్ అధికారులు కలిసి బ్యాంకులో వాటిని డిపాజిట్ చేసేవారు. అవి బౌన్స్ అయితే వెంటనే లీగల్ నోటీసులు పంపి అవసరమైన చర్యలు తీసుకోనేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఈ ఏడాది రూ.344 కోట్లు చెక్కుల రూపంలో వచ్చినట్లు తెలిసింది.
ఈ ఏడాది నుంచి చెక్కులు బంద్ ?
బల్దియాను ఇప్పటికే ఆర్థికకష్టాలు వెంటాడుతుండగా.. చెక్కుల బౌన్స్ నుంచి గట్టెక్కేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బౌన్స్ అవుతున్న చెక్కులపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మరోసారి అలా జరకుండా ప్లాన్ రూపొందిస్తున్నారు. ఈ ఆర్థిక ఏడాది నుంచి చెక్కుల రూపంలో కాకుండా పూర్తిగా ఆన్ లైన్ లేదా మీ సేవా ద్వారా ట్యాక్స్ లు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. చెక్కుల చిక్కులు లేకుండా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బల్దియావర్గాలు చెబుతున్నాయి.