బాక్సర్ నిఖత్ జరీన్ కు సన్మానం

హైదరాబాద్, వెలుగు: వరల్డ్​చాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ బుధవారం సన్మానించారు. ఇటీవల కజకిస్తాన్ లో జరిగిన ఎలోర్డా కప్ పోటీల్లో 52 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో విజేతగా నిలిచి గోల్డ్​మెడల్​ సాధించిన నిఖత్ జరీన్ బుధవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో కమిషనర్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్​ రోనాల్డ్​రోస్​ మాట్లాడుతూ.. నిఖత్​ జరీన్​ మున్ముందు మరింతగా రాణించాలని ఆకాక్షించారు. రాష్ట్ర, దేశ ప్రతిష్ఠను మరింత పెంచాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తోందని, క్రీడారంగ అభివృద్ధికి జీహెచ్ఎంసీ కృషి చేస్తోందని చెప్పారు. బాల, బాలికల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సమ్మర్ కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేశామని తెలిపారు. జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఆర్ ప్రేమ్ రాజ్, మాజీ ట్రెజరర్ కె.మహేశ్వర్, తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబురావు సాగర్ పాల్గొన్నారు.