2028 ఒలింపిక్స్‌‌లో బాక్సింగ్‌‌కు ఓకే

2028 ఒలింపిక్స్‌‌లో బాక్సింగ్‌‌కు ఓకే

లాసానె:  సుదీర్ఘ వివాదాలు, పరిపాలన గందరగోళాల అనంతరం బాక్సింగ్‌‌ను 2028 లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్‌‌లో అధికారికంగా చేర్చేందుకు మార్గం సుగమం అయింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)  ప్రెసిడెంట్ థామస్ బాచ్ సోమవారం ఈ విషయాన్ని ప్రకటించారు. ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు 2028 ఒలింపిక్ ప్రోగ్రామ్‌‌లో బాక్సింగ్‌‌ను చేర్చేందుకు అనుమతిని ఇచ్చిందని, ఈ వారంలో సుమారు 100 మంది ఐఓసీ సభ్యుల నుంచి తుది ఆమోదం వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. 

2019లో పరిపాలన, ఆర్థిక  వివాదాల కారణంగా  రష్యా ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబీఏ)తో ఐఓసీ సంబంధాలు తెంచుకుంది. 2023లో ఐబీఏను ఒలింపిక్ గేమ్స్ జాబితా నుంచి పూర్తిగా తొలగించింది. టోక్యో, పారిస్ ఒలింపిక్స్‌‌లో ఐఓసీ స్వతంత్రంగా బాక్సింగ్ ఈవెంట్లను నిర్వహించింది. ఈ క్రమంలో కొన్ని దేశాలు కలిసి ‘వరల్డ్ బాక్సింగ్’ అనే కొత్త పరిపాలనా సంస్థను ఏర్పాటు చేశాయి. ఇటీవలే వరల్డ్ బాక్సింగ్‌‌కు ఐఓసీ అధికారిక గుర్తింపు ఇచ్చింది. 

అమెరికా, బ్రిటన్, ఇండియా, చైనా తదితర ప్రధాన ఒలింపిక్ దేశాలు దీనికి మద్దతు పలికాయి. రష్యా, స్పెయిన్‌‌తో పాటు  కొన్ని ఆఫ్రికన్ దేశాలు ఈ ఫెడరేషన్‌‌లో  చేరలేదు. ‘ఈ ప్రతిపాదనకు ఐఓసీ సెషన్ ఆమోదం తెలుపుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రపంచంలోని బాక్సర్లంతా తమ నేషనల్‌‌ ఫెడరేషన్ వరల్డ్ బాక్సింగ్ నుంచి  గుర్తింపు పొందేలా చేస్తే 2028 లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్‌‌లో పోటీపడే అవకాశం లభిస్తుంది’అని బాచ్ తెలిపారు.