ఎంత పని చేశావ్ రా బాబు: విమానాలకు బాంబ్ బెదిరింపుల కేసులో బాలుడు అరెస్ట్

ఎంత పని చేశావ్ రా బాబు: విమానాలకు బాంబ్ బెదిరింపుల కేసులో బాలుడు అరెస్ట్

ఇటీవల దేశంలో విమానాలకు వరుస బాంబ్ బెదిరింపు కాల్స్, మేసేజ్‎లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గడిచిన 48 గంటల్లోనే 13 విమానాలకు బాంబ్ థ్రెట్ కాల్స్ వచ్చాయి. విమానాలను పేల్చేస్తామంటూ వస్తోన్న కాల్స్, సందేశాలను సీరియస్‎గా తీసుకున్న పోలీసులు.. బెదిరింపు ఫోన్లు, మేసేజ్‎లు చేస్తోన్న వ్యక్తుల కోసం ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఛత్తీస్‎గఢ్‎కు చెందిన ఓ మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో బాలుడు చెప్పిన విషయాలు విని అధికారులు ఖంగుతిన్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఛత్తీస్ గఢ్‎కు చెందిన ఓ బాలుడికి డబ్బుల విషయంలో అతడి ఫ్రెండ్‎తో గొడవ జరిగింది. దీనిని మనసులో పెట్టుకున్న బాలుడు ఎలాగైనా తన ఫ్రెండ్‎ను ఇరికించాలనుకున్నాడు.

ALSO READ | ఒకేరోజు నాలుగు విమానాలకు బాంబు బెదిరింపులు

ఇందుకోసం సోషల్ మీడియాలో తన స్నేహితుడి పేరుతో ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ఓపెన్ చేశాడు. అ అకౌంట్ నుండి విమానాలకు బాంబ్ బెదిరింపు పోస్టులు పెట్టాడు. ఇలాగే మూడు విమానాలకు బాంబ్ బెదిరింపు సందేశాలు పోస్టు చేశాడు. ఎయిర్ లైన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. విమానాల్లో బాంబ్ పెట్టామంటూ సోషల్ మీడియాలో పెట్టిన బెదిరింపు పోస్టుల వెనక మైనర్ బాలుడు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు బాలుడి తల్లిదండ్రులకు నోటీసులు ఇచ్చి.. బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‎కు తరలించారు. మిగిలిన విమానాలకు వచ్చిన బాంబు బెదిరింపు కాల్స్, మేసేజ్‎లకు ఈ బాలుడికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.