- మలక్ పేటలోని సేఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఘటన
- వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రుల ఆందోళన
- తమకు చెప్పకుండా ఉస్మానియా మార్చురీకి తరలించారని ఆరోపణ
ఎల్బీనగర్, వెలుగు: మలక్ పేటలోని సేఫ్ చిల్డ్రన్స్హాస్పిటల్లో దారుణం జరిగింది. ట్రీట్మెంట్ తీసుకుంటూ 3 నెలల బాలుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ బాలుడి తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆందోళనకు దిగారు.
మహబూబ్ నగర్ జిల్లా అక్కారం గ్రామానికి చెందిన కేతావత్ హనుమంత్ తన 3 నెలల కొడుకుకి నిమోనియా రావడంతో అక్టోబర్ 9న మలక్ పేటలోని సేఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్కు తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. 3 రోజుల నుంచి బాబును ఐసీయూలో ఉంచి ఆదివారం జనరల్ వార్డుకు మార్చారు. సోమవారం సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారని, ఇంతలోనే మధ్యాహ్నం నర్స్ వచ్చి డాక్టర్స్ సూచించిన ఇంజక్షన్ వేసిన 10 నిమిషాలకే తన కొడుకు మృతి చెందాడని బాలుడి తండ్రి హనుమంత్ ఆరోపించారు.
కొద్దిసేపటిలోనే పోలీసులు చేరుకుని బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారని, ఈ విషయం కూడా తమకు చెప్పలేదన్నారు. తన కొడుకు మృతికి కారణమైన వైద్యులతో పాటు తమ చెప్పకుండా బాడీని తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. ఈ మేరకు హాస్పిటల్లో బైఠాయించి ఆందోళనకు దిగారు.