మణికొండలో వేడి నీళ్లు పడి బాలుడు మృతి

గచ్చిబౌలి, వెలుగు: మణికొండలో వేడి నీళ్లు మీద పడి నాలుగేండ్ల బాలుడు చనిపోయాడు. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు డ్రైవర్​గా పనిచేసే మైస రాజు, భార్య సోనీ, కొడుకు ధీరజ్(4)​తో కలిసి మణికొండ సింహపురి కాలనీలో ఉంటున్నాడు. రోజూలాగే ఈ నెల 6న రాజు డ్యూటీకి వెళ్లాడు. సోనీ, ధీరజ్ ఇంట్లోనే ఉన్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో సోనీ స్నానం చేసేందుకు బకెట్ లో నీళ్లు పట్టి హీటర్​ఆన్​చేసింది.

తర్వాత ఇంట్లో ఆమె పనులు చూసుకుంటోంది. ఈ క్రమంలో నీళ్లు బాగా వేడెక్కాయి. అదే టైంలో ధీరజ్ ఆడుకుంటూ వేడి నీళ్ల బకెట్ వద్దకు వచ్చాడు. బకెట్​ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఒరిగి వేడి నీళ్లు ధీరజ్ పై పడ్డాయి. ఈ ప్రమాదంలో బాలుడి శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు మొదట నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

60 శాతం కాలిన గాయాలతో బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం ధీరజ్​చనిపోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.