ప్రేమంటేనే.. ఒక మైకం. ఇక ఆ మైకంలో ఉన్నప్పుడు చేసే విన్యాసాలకు అదుపే ఉండదు. ఇంట్లో వారికి తెలియకుండా తిరిగే సినిమాలు, షికార్ల నుండి మొదలుపెడితే.. ఇంట్లో వారికి స్నేహితుడంటూ చేసే పరిచయాలు వరకూ ఎన్నో దాగుంటాయి. ఇక అప్పుడప్పుడు అలగడాలు.. బుజ్జి, నాన్న, బంగారం అంటూ బుజ్జగింపులు అబ్బో ఇలా బోలెడు కథలు ఉంటాయి. ఇలాంటి ప్రేమికుల్లో వీరిది మరో లెవెల్. ఒకప్పటి లైలా- మజ్ను ప్రేమ గురుంచి మనం కథలు కథలుగా వింటుంటాం.. కానీ వారి ప్రేమైనా ఈ స్థాయిలో ఉండేదో.. ఉండనిదో..
ప్రియురాలు చేత పంటి గాట్లు పడేలా కొరికించుకొని.. ఆ గుర్తులను టాటూ వేపించుకున్నాడు.. ఓ ప్రేమికుడు. ప్రేమ కాటును గుర్తుగా దాచాలనుకున్న అతని ఆలోచనే చెత్తదంటే.. ప్రేమికుడు అడగ్గానే కాట్లు పడేలా కొరికిన ఆ ప్రియురాలు ఇంకెంత గొప్పదో ఆలోచించండి. దీన్ని పిచ్చి అంటారో.. ప్రేమ అంటారో మీరే చెప్పాలి. ప్రియురాలు పేరు.. వారి బంధం మొదలైన తొలి రోజుకు గుర్తుగా తేదీ రెండు కలిపి 'పెరూ', '16.9.23' అని టాటూగా వేపించుకున్నాడు. స్కై టాటూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే 1 మిలియన్ పైగా వీక్షించారు.
ఈ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. వెంటనే రాబిస్ టీకా తీసుకోవాలని సూచించే వారు కొందరైతే, ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబు.. అని ప్రశ్నించేవారు మరికొందరు. ఇదే జంట కింది మరొక వీడియోలో తమ ప్రేమకు గుర్తుగా లవ్ సింబల్స్ (హృదయం ఆకారం) టాటూగ వేపించుకోవటం చూడవచ్చు.