
కర్నాటకలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వేర్వేరు మతాలకు చెందిన ఓ జంటపై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా దాడిచేశారు. ఈ ఘటన అక్టోబర్ 20న చిక్బల్లాపూర్లోని గౌరిబిదనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపురంకు చెందిన మైనర్ బాలుడు, మైనర్ బాలిక ప్రేమించుకున్నారు. వారిద్దరూ ఇంట్లో చెప్పకుండా కర్నాటక పారిపోయారు. గౌరిబిదనూర్ ప్రాంతంలో వీరిని గమనించిన కొంతమంది ఈ జంటపై దాడిచేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో బాలుడిని వారు కొట్టడంతో కన్ను వాయడం కూడా చూడొచ్చు. ఈ ఘటన గురించి అనంతపురం ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప మాట్లాడుతూ.. మైనర్లపై దాడికి పాల్పడిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వారందరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని.. చట్టపరమైన చర్యలు ప్రారంభించబడ్డాయని ఆయన తెలిపారు. తదుపరి చర్యల కోసం ఈ కేసును కర్ణాటక పోలీసులకు అప్పగించనున్నట్లు ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు.