ఒలింపిక్ బాక్సింగ్ పోటీలు వివాదాస్పదం అయ్యాయి. విమెన్స్ 66 కేజీ కేటగిరీ బౌట్‌లో అమ్మాయితో ఓ అబ్బాయి పోటీ పడ్డాడంటూ రచ్చ జరుగుతోంది. గతేడాది జెండర్ ఎలిజిబిలిటీ టెస్టులో ఫెయిలైన అల్గేరియా బాక్సర్ ఇమానె ఖెలీఫ్ కేవలం 46 సెకండ్లలోనే ఇటలీ ప్రత్యర్థి ఏంజెలా కరిని నాకౌట్ చేయడం ఈ వివాదానికి కారణమైంది. ఖెలీఫ్ ముఖం మీద బలమైన విసిరిన పంచ్‌కు మోకాళ్లపై కూర్చొని కన్నీళ్లు పెట్టిన కరిని బౌట్ కొనసాగించేందుకు ఇష్టపడలేదు.
దాంతో ఖెలీఫ్‌ను విజేతగా ప్రకటించారు. దీనిపై స్పందించిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని బౌట్ ఇద్దరు సమాన వ్యక్తుల మధ్య జరగడం లేదని అభిప్రాయపడ్డారు. ఎలోన్ మస్క్ తదితర సెలబ్రిటీలు అమ్మాయిల బాక్సింగ్‌లో అబ్బాయిలను ఎలా అనుమతిస్తారు? అని ఎక్స్‌లో ప్రశ్నించారు. అయితే, ఖలేఫ్‌తో పాటు మరో డిస్‌క్వాలిఫైడ్ బాక్సర్‌ను ఈ ఒలింపిక్స్‌కు అనుమతించిన ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తమ నిర్ణయాన్ని తాజాగా సమర్థించుకుంది. విమెన్స్ కేటగిరీలో పోటీ పడుతున్న ప్రతి ఒక్కరూ పోటీ అర్హత నిబంధనలను పాటిస్తున్నారని స్పష్టం చేసింది.