- కాంపౌండర్ ట్రీట్మెంట్ చేయడమే కారణమని ఆరోపణ
హుజూర్ నగర్, వెలుగు: వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిన బాలుడు వైద్యం వికటించి మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలం లక్ష్మిపురం గ్రామానికి చెందిన లోడంగి సాయి కృష్ణా ,శిరీష దంపతులకు ఇద్దరు కుమారులు. అందులో పెద్ద కుమారుడైన లోడంగి రిత్విక్ సిద్ధార్థ(5)కు జ్వరం, వాంతులు, విరేచనాలు కావడంతో శుక్రవారం ఆర్ఎంపీ దగ్గర ట్రీట్మెంట్ చేయించారు.
అయినా తగ్గకపోవడంతో హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిర పిల్లల హాస్పిటల్‌లో చేర్పించారు. డాక్టర్ లేకపోవడంతో కాంపౌండర్ ట్రీట్మెంట్ చేశారు. ఏమైందో ఏమో గానీ శనివారం తీవ్ర జ్వరంతో పాటు ఫిట్స్ వచ్చాయి. దీంతో కాంపౌండర్ మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్లాలని సూచించాడు. అంబులెన్స్‌లో తరలిసుండగా మార్గమధ్యలోనే బాబు మృతి చెందాడు.
దీంతో కంపౌండర్ ట్రీట్మెంట్ చేయడంతోనే తమ కొడుకు చనిపోయాడని, తమకు న్యాయం చేయాలని మృతుడి తల్లిదండ్రులు, గ్రామస్తులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనను విరమింపజేశారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ గుగులోతు రాములు నాయక్ తెలిపారు.