చెరువులో పడి బాలుడు మృతి.. చంపి ఉంటారని తల్లిదండ్రుల అనుమానం

కోల్​బెల్ట్, వెలుగు :  ఓ బాలుడు చెరువులో పడి చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మందమర్రి మండలం అందుగులపేటలో జరిగిన ఈ ఘటన వివరాలను టౌన్ ఎస్సై చంద్రకుమార్​వివరించారు. అందుగులపేట గ్రామానికి చెందిన డ్రైవర్​సత్యనారాయణ, రాజేశ్వరి దంపతుల కొడుకు ప్రణీత్(14) గురువారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రమైనా ప్రణీత్ ఇంటికి  రాకపోవడంతో కుటుంబసభ్యులు రాత్రంతా వెతికినప్పటికీ జాడ దొరకలేదు. అయితే గ్రామానికి చెందిన గారాపు మహేశ్, మేకల అక్షయ్ తో కలిసి బైక్​పై ఊరు శివారులోని ఎర్ర చెరువు వైపు వెళ్లినట్లు స్థానికులు శుక్రవారం ఉదయం చెప్పడంతో ప్రణీత్​తల్లిదండ్రులు ఆ ఇద్దరి ఇంటికి వెళ్లి ప్రశ్నించారు.

దీంతో వారు అసలు విషయం బయటపెట్టారు. తాము ముగ్గురం చేపలు పట్టేందుకు ఎర్ర చెరువులోకి తెప్పలో వెళ్లామని, కానీ ప్రమాదవశాత్తూ ప్రణీత్​నీళ్లలో పడి చనిపోయినట్లు వెల్లడించారు. శవాన్ని ఒడ్డుకు తీసుకు వచ్చామని, కానీ భయంతో అక్కడే వదిలి ఇంటికి చేరుకున్నామని పేర్కొన్నారు. దీంతో తల్లిదండ్రుల బోరు ఏడుస్తూ డెడ్​బాడీ వద్దకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై చంద్రకుమార్​ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రణీత్​డెడ్​బాడీని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన కొడుకు ప్రణీత్​ను మహేశ్​చంపి ఉంటాడని అనుమానం వ్యక్తంచేసిన తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.