ఫంక్షన్‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌ అడ్రస్‌‌‌‌‌‌‌‌ అడిగి, బాలుడి కిడ్నాప్‌‌‌‌‌‌‌‌

మిర్యాలగూడ, వెలుగు: ఫంక్షన్‌ హాల్‌ అడ్రస్‌ అడిగే పేరుతో ఓ బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో వదిలిపెట్టారు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం జరిగింది. మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన విరగని లక్ష్మణ్ కుమారుడు ద్వారకానాథ్‌ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. బాలుడు శనివారం ఉదయం 6 గంటలకు వాకింగ్‌ చేసేందుకు వెళ్లాడు. 

ఈ టైంలో గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఓ ఫంక్షన్‌హాల్‌ అడ్రస్‌ అడుగుతూ బాలుడిని కిడ్నాప్‌ చేసి కారులో తీసుకెళ్లారు. ద్వారకానాథ్‌ తిరిగి రాకపోవడంతో అతడి తండ్రి పట్టణంలోని పలు చోట్ల వెదికినా ఆచూకీ దొరకలేదు. ఉదయం 10 గంటల టైంలో బాలుడు తల్లికి ఫోన్‌ చేసి తనను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో వదిలేశారని, ఇక్కడ ఉన్న వారి సెల్‌తో ఫోన్‌ చేస్తున్నానని చెప్పాడు. దీంతో లక్ష్మణ్‌ హైదరాబాద్‌లోనే ఉన్న తన సోదరుడిని ఎంజీబీఎస్‌కు పంపించడంతో అతడు బాలుడిని ఇంటికి తీసుకెళ్లాడు.