బట్టలు కొనిస్తామని బాలుడి కిడ్నాప్

బట్టలు కొనిస్తామని బాలుడి కిడ్నాప్
  •      రూ.లక్షన్నరకు అమ్మే ప్రయత్నం 
  •     తల్లి ఫిర్యాదుతో 5 గంటల్లో కేసును ఛేదించిన కాచిగూడ పోలీసులు

బషీర్ బాగ్, వెలుగు: బట్టలు కొనిస్తానని నమ్మబలికి ఓ దుండగుడు మూడు నెలల బాలుడిని కిడ్నాప్ ​చేశాడు. తల్లి ఫిర్యాదుతో స్పందించిన కాచిగూడ పోలీసులు గంటల వ్యవధిలో బాలుడిని ట్రేస్​చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నరసయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గౌలిగూడకు చెందిన బోగ నర్సింగ్​రాజ్ పంజాగుట్టలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో టెక్నీషియన్. 

అతనికి కార్వాన్ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి రాఘవేంద్ర, ఉమావతితో పరిచయం ఉంది. తనతోపాటు బట్టల షాపులో పనిచేసే సంధ్యారాణికి చాలా కాలంగా పిల్లలు కలగడం లేదని ఉమావతి తెలుసుకుంది. దత్తతకు పిల్లలు కావాలని సంధ్యారాణి కోరడంతో, ఆ విషయాన్ని ఉమావతి నర్సింగ్ రాజ్ , రాఘవేంద్రకు చెప్పింది. ముగ్గురు కలిసి దత్తతకు పిల్లలను ఇప్పిస్తామని రూ.లక్షన్నర  డిమాండ్​చేశారు. 

తొలివిడతగా రూ.లక్ష తీసుకున్నారు. ఆరు నెలలు గడుస్తున్నా.. పిల్లలను ఇప్పించకపోవడంతో సంధ్యారాణి వారిని ఒత్తిడి చేసింది. దీంతో నర్సింగ్ రాజ్, ఉమావతి, రాఘవేంద్ర కిడ్నాప్​ స్కెచ్ ​వేశారు. సోమవారం మధ్యాహ్నం చాదర్​ఘాట్ చౌరస్తాలో మూడు నెలల మగ శిశువుతో భిక్షాటన చేసున్న వరలక్ష్మిని నర్సింగ్ రాజ్ గమనించాడు. ఆమెతో మాటలు కలిపి కొత్త బట్టలు కొనిస్తానని నమ్మబలికాడు. 

తనతోపాటు కాచిగూడ డీమార్ట్ కు తీసుకెళ్లాడు. వరలక్ష్మి బట్టలు చూస్తుండగా బాలుడితో నర్సింగ్ రాజ్ ఎస్కేప్​అయ్యాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన వరలక్ష్మి సోమవారం సాయంత్రం 6 గంటలకు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్​స్పెక్టర్​చంద్ర కుమార్, ఎస్సైలు సుభాశ్, రవికుమార్ సీసీ ఫుటేజీల ఆధారంగా నర్సింగ్ రాజ్ బాలుడిని ఆటోలో కార్వాన్ తీసుకెళ్లినట్లు గుర్తించారు. అక్కడికి చేరుకొని నర్సింగ్ రాజ్, రాఘవేంద్రను అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని తల్లి చెంతకు చేర్చారు. నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు డీసీపీ తెలిపారు. ఉమావతి పరారీలో ఉంది.