
సంగారెడ్డి, వెలుగు: చావనైనా చస్తాను గానీ చెట్లను మాత్రం నరకనివ్వనని 12 ఏండ్ల బాలుడు నిరసనకు దిగాడు. కాంట్రాక్టర్ నరికిస్తున్న చెట్టుపైనే.. తిండి తిప్పలు మానేసి 9 గంటల పాటు భీష్మించుకుని కూర్చున్నాడు. ఎట్టకేలకు చెట్టును కాపాడాలనే తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం కాకతీయనగర్ లో మంగళవారం చోటు చేసుకుంది. కాకతీయనగర్ లో రోడ్డు వెడల్పు కోసం చెట్లను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. అందుకు ఓ కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారు.
మంగళవారం ఉదయం 7 గంటలకు చెట్లను నరికే పనులు ప్రారంభించారు. అంతలో అదే కాలనీకి చెందిన అనిరుద్(12) అనే బాలుడు కాంట్రాక్టర్ దగ్గరకు వెళ్లాడు. దయచేసి చెట్లను నరకవద్దని రిక్వెస్ట్ చేశాడు. అతని మాటలు లెక్కచేయని కాంట్రాక్టర్..చెట్ల తొలగింపు పనులు కొనసాగించాడు. దాంతో ఏం చేయాలో తెలియని అనిరుద్..కాంట్రాక్టర్ నరుకుతున్న చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు.
చావనైనా చస్తాను గానీ చెట్లను నరకనివ్వనని తెగేసి చెప్పాడు. తిండి తిప్పలు మానేసి చెట్టుపైనే నిరసనకు దిగాడు. కాంట్రాక్టర్, కాలనీవాసులు, చివరకు తల్లిదండ్రులు నచ్చజెప్పినా వినలేదు. పైగా ఆ చెట్టును నరికితే తాను చచ్చిపోతానని బెదిరించాడు. చెట్లను నరకబోమని అధికారులు ఆర్డర్ కాఫీ ఇస్తేనే చెట్టు దిగుతానని మొండికేశాడు. ఎవరు చెప్పిన బాలుడు వినకపోవడంతో సదరు కాంట్రాక్టర్, సమీప బిల్డింగ్ యజమాని వచ్చి చెట్లను నరకబోమని అతనికి హామీ ఇచ్చారు. దాంతో అనిరుద్.. మధ్యాహ్నం 3 గంటలకు చెట్టు దిగి తన నిరసనను విరమించాడు.
చెట్లను నరకనివ్వకండి
"అందరికీ ఉపయోగపడే చెట్లను నరకనివ్వద్దు. మనుషులకు ఆక్సిజన్ ఇవ్వడమే కాకుండా పక్షులకి ఆవాసంగా ఉండే చెట్లను కాపాడాలి. అందరికి చెట్టు ప్రాముఖ్యత తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేశా. ఎక్కడైనా చెట్లు నరుకతున్నట్టు కనిపిస్తే ఇలాగే చేస్తా. ప్రకృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ చెట్ల మనుగడను పరిరక్షించాలి" అని అనిరుద్ పేర్కొన్నాడు.