తాళం కప్పను మింగిన బాలుడు.. ఎండోస్కోపి చేసి బయటకు తీసిన డాక్టర్

ఖమ్మం టౌన్, వెలుగు : ఐదేండ్ల బాలుడు మింగిన తాళంకప్పను ఎండోస్కోపి చేసి బయటకు తీశారు డాక్టర్. జంగాల సునీల్  కుమార్. బాలుడి తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. ఖమ్మం సిటీలోని ఖిలాబజార్  రాతి దర్వాజకు చెందిన మసూద్, రేష్మ దంపతుల కుమారుడు ముహాయిజ్ (5) బుధవారం రాత్రి ఆడుకుంటూ తాళంకప్పను మింగాడు. దీంతో పేరెంట్స్  బాలుడిని సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్.. సర్జరీ చేసి తాళంకప్పను బయటకు తీయాల్సి ఉంటుందని సూచించారు.

సదరు డాక్టర్  సూచనతో స్థానిక సాయిరాం గ్యాస్ట్రో అండ్ లివర్  హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ముహాయిజ్ ను పరీక్షించిన డాక్టర్ జంగాల సునీల్ కుమార్.. ఎటువంటి సర్జరీ చేయకుండానే ఎండోస్కోపి చేసి (గొంతులో బెలూన్  పంపి ఆ బెలూన్ ను పెద్దదిగా చేయడం) తాళంకప్పను బయటకు తీశారు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మెట్రో సిటీలకు దీటుగా అత్యాధునిక పరికరాలతో, అతి తక్కువ ఖర్చుతో ఎలాంటి ఆపరేషన్   లేకుండా తాళంకప్పను బయటకు తీసిని డాక్టర్  సునీల్ కుమార్ ను సహచర వైద్యులు, స్థానికులు అభినందించారు.