రాజ్యసభ బాయ్‌కాట్
సస్పెన్షన్ ఎత్తేసే వరకూ సభను బహిష్కరిస్తాం: ప్రతిపక్షాలు
కేంద్రానికి వార్నింగ్
క్షమాపణలు చెబితేనే సస్పెన్షన్ పై ఆలోచిస్తామన్న సర్కారు
న్యూఢిల్లీ, వెలుగు: ఎంపీల సస్పెన్షన్‌ను ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభను బాయ్‌కాట్ చేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. మంగళవారం రాజ్యసభ నుంచి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, ఎన్సీపీ, ఎస్పీ, శివసేన, ఆర్జేడీ, డీఎంకే, టీఆర్ఎస్, ఆప్ వాకౌట్ చేశాయి. సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ మీడియాతో మాట్లాడారు. సస్పెన్షన్ ఎత్తేసే వరకూ సభా కార్యకలాపాలను బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతుధర కంటే దిగువన ఏ కంపెనీగానీ, వ్యక్తులుగానీ రైతుల నుంచి పంటలు కొనుగోలు చేయకుండా మరో బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకే కనీస మద్దతు ధరను నిర్ణయించాలని, కేంద్ర, రాష్ట్రాలు, ఎఫ్ సీఐ కూడా దాని కంటే దిగువన పంటలు కొనుగోలు చేయకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ మూడు డిమాండ్లను తీర్చే వరకూ తాము సభను బాయ్‌కాట్ చేస్తామన్నారు. కాగా, సభను బాయ్ కాట్ చేయాలన్న ప్రతిపక్షాల నిర్ణయాన్ని మార్చుకోవాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సూచించారు.
అపాలజీ చెబితేనే..
సస్పెండ్ అయిన ఎంపీలను పూర్తిగా సభకు దూరం చేయాలని ప్రభుత్వం భావించడం లేదని, వారు క్షమాపణలు కోరితే, సస్పెన్షన్‌ను ఎత్తేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. చైర్ తప్పు చేసినట్టుగా చిత్రీకరించేందుకు సస్పెండ్ అయిన ఎంపీలు ప్రయత్నిస్తున్నారని రాజ్యసభ నాయకుడు థావర్‌చంద్ గెహ్లాట్ చెప్పారు. చైర్ నిర్ణయమే సుప్రీం అని, తప్పుపట్టడం మంచిది కాదన్నారు.
ఆందోళన విరమించిన ఎంపీలు
సస్పెండ్ అయిన ఎనిమిది మంది ఎంపీలు తమ ఆందోళనను మంగళవారం విరమించారు. సస్పెండ్ అయిన వీరంతా పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోని నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. రాజ్యసభ కార్యకలాపాలను బాయ్‌కాట్ చేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించిన క్రమంలో తమ ఆందోళనను ఆపేశారు.
మూడున్నర గంటల్లో 7 బిల్లులకు ఆమోదం
ప్రతిపక్షాలు రాజ్యసభను బాయ్‌కాట్ చేయడంతో కీలక బిల్లులకు ఆమోదింపజేసుకునేందుకు కేంద్రం ప్రయత్నంచేసింది. మంగళవారం ప్రతిపక్షాలు సమావేశాలను బాయ్‌కాట్ చేసిన తర్వాత మూడున్నర గంటల్లో 7 కీలక బిల్లులను ఆమోదించుకుంది. ఉల్లి, పప్పులు, తృణధాన్యాలను నిత్యావసర వస్తువుల లిస్ట్ నుంచి తొలగించే బిల్లు, కంపెనీలు చేసే కొన్ని నేరాలకు జరిమానాలను రద్దు చేసే బిల్లు, కొత్తగా ఐదు ఐఐఐటీల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు, కోఆపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తీసుకొచ్చే బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్ సవరణలు, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ బిల్లు, రాష్ట్రీయ రాకష్ యూనివర్సిటీ బిల్లు, ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ అమెండ్ మెంట్ బిల్లులు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. మెజారిటీ ప్రతిపక్ష పార్టీలు సభను బాయ్‌కాట్ చేయగా.. బీజేపీ, దాని మిత్రపక్షాలతోపాటు ఏఐఏడీఎంకే, బీజేడీ, వైసీపీ, టీడీపీ సభ్యులు ఈ బిల్లులపై జరిగిన చర్చలో పాల్గొన్నారు.
లోక్‌సభలోనూ..
సస్పెన్షన్‌కు గురైన రాజ్యసభ ఎంపీలకు మద్దతుగా కాంగ్రెస్, టీఎంసీ, బీఎస్పీ, టీఆర్ఎస్ మంగళవారం లోక్‌సభ కార్య కలాపాలను బాయ్‌కాట్ చేశాయి. రాజ్యసభ ఎంపీలకు మద్దతుగా అన్ని పార్టీలు బాయ్‌కాట్ చేయాలని నిర్ణ యించినట్టు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి చెప్పారు. రాజ్యసభ అంశాలను ఇక్కడ(లోక్‌సభలో) ప్రస్తావించ వద్దని స్పీకర్ ఓంబిర్లా సభ్యులకు సూచించారు.
సారీ చెప్పాకే.. పరిశీలిస్తం
ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ పై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. సభలో తమ ప్రవర్తనకు ఆ ఎంపీలు క్షమాపణ చెప్పాకే సస్పెన్షన్ ఎత్తివేతపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్ బయట మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభలో 8 మంది సభ్యులు ప్రవర్తించిన తీరును కాంగ్రెస్ ఖండిస్తుందని ఆశించామన్నారు. ‘విదేశాల నుంచి ఓ ట్వీట్ వస్తుంది.. ఇక్కడ సభలో ఎంపీలు రాద్ధాంతం చేస్తరు. ఇదేం రాజకీయం’ అంటూ రాహుల్ ట్వీట్లను ప్రస్తావిస్తూ మంత్రి మండిపడ్డారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ టేబుల్ పైకెక్కి, పేపర్లు చింపుతూ డ్యాన్స్ చేయడం తామెన్నడూ చూడలేదని రవిశంకర్ విమర్శించారు.
ఎంపీల తీరు బాధించింది
వాళ్లలో మార్పుకోసం నిరాహార దీక్ష: డిప్యూటీ చైర్మన్
ప్రజాస్వామ్యం పేరుతో సభలో ప్రతిపక్ష ఎంపీలు ప్రవర్తించిన తీరు తనను ఎంతో బాధకు, మానసిక వేదనకు గురిచేసిందని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అన్నారు . ఎంపీల తీరుకు నిరసనగా, వారిలో మార్పు రావాలని కోరుకుంటూ మంగళవారం(24 గంటలు) నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడుకు లెటర్ రాశారు. ఈ నెల 20న సభలో చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరమని అన్నారు. తన కళ్లతో అలాంటి సంఘటనలు చూడాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదన్నారు. సభా మర్యాదకు, చైర్మన్ సీటు గౌరవానికి భంగం కలిగించేలా సభ్యులు ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.
For More News..
బాలీవుడ్ టాప్ యాక్టర్లకూ డ్రగ్స్ కేసుతో లింక్ ?