బోయి భీమన్న సాహితీ ముచ్చట్లు

బోయి భీమన్న సాహితీ ముచ్చట్లు

దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాల్లో విశిష్ట స్థానం సంపాదించుకున్న దామోదరం సంజీవయ్యతో సుప్రసిద్ధ కవి బోయి భీమన్న సాహితీ సాన్నిహిత్యం ఒక మరపురాని మధురాతి మధురమైన ఘట్టం. బోయి భీమన్న తాను రచించిన ‘మధుబాల’, ‘రసోదయం’ కావ్యాలను ఎంతో ఇష్టంతో సంజీవయ్యకు అంకితం ఇవ్వడం దీనికి నిదర్శనం.

అది 1952,  ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజాజీ కేబినేట్‌‌‌‌లో మంత్రిగా ఉండేవారు దామోదరం సంజీవయ్య. ఆ సమయంలో బోయి భీమన్న తన మొదటి కావ్యం ‘మధుగీత’ను సంజీవయ్యకు అంకితం ఇచ్చారు. ఆ సందర్భంగా సంజీవయ్య తన సరస ధోరణిలో ‘నాకెందుకండీ, ఏ ప్రకాశం గారికో, పట్టాభిగారికో అంకితం ఇస్తే మీకు మంచి పేరు వస్తుంది’ అన్నప్పుడు, భీమన్న అంతే సహజ నైజంతో ‘‘వారికి ఎంతమందైనా ఇస్తారు. దళితుల్లో రాసే వాళ్లే తక్కువ, అంకితం పుచ్చుకునే స్థాయి గలవాళ్లు ఇంకా తక్కువ” అంటూ వాస్తవికతను చాటిచెప్పటం విశేషం. అంకిత సభను మద్రాసులో తిరుమల రామచంద్ర, ట్రిప్లికేస్‌‌‌‌లో ఉంటున్న డాబాపై ఏర్పాటు చేశారు. నార్ల వేంకటేశ్వర రావు సభాధ్యక్షులు, నిడదవోలు వెంకట్రావు కావ్య కన్యాదాన పురోహితులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రధాన వక్త. అంకితమిచ్చే పుస్తకం పేరు ప్రస్తావిస్తూ, తాపీ ధర్మారావు భీమన్నతో ‘‘ఏం బ్రదర్‌‌‌‌‌‌‌‌! మధుబాలకు (అనగా హిందీ సినీ తార) ప్రచారం తక్కువయ్యిందని నీ కావ్యానికి ఆ పేరు పెట్టావా’’ అని చమత్కరించేసరికి సభ నవ్వులతో నిండిపోయిందట. సంజీవయ్య తన మొదటి సాహితీ ప్రసంగం చేసింది కూడాఈ సభలోనే అని ప్రతీక.

కవి పోషణ

కవి పోషణలో బోయి భీమన్నను మించిన ఆప్తులు లేరు అనడానికి తన సన్నిహితులలో ఒకరైన పోతుకూచి సాంబశివరావుపై చూపిన శ్రద్ధ మరువరానిది. పోతుకూచి అప్పట్లో కార్మిక శాఖలో చిరుద్యోగి. భీమన్న సలహాపై అప్పటి ముఖ్యమంత్రి సంజీవయ్య పోతుకూచికి అసిస్టెంట్‌‌‌‌ లేబర్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా పదోన్నతి కల్పించారు. ప్రతిభ ఉన్న సాహితీపరులంతా వివిధ శాఖల్లో విరామం లేకుండా ఆఫీసులకు అతుక్కుపోవడం భీమన్నను ఆవేదనకు గురి చేసేది. అందువల్ల పోతుకూచి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీసులో గడపాల్సిన అవసరం లేకపోయింది. ఆ తరువాత జరిగిన అఖిల భారత తెలుగు రచయితల తొలి మహాసభల్లో పోతుకూచి కార్యదర్శిగా వ్యవహరించారు.

భయం పోయింది

భీమన్న విరచిత ‘ధర్మం కోసం పోరాటం’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని 1968లో ఆవిష్కరించారు. ఆ సభలో మాట్లాడుతూ ‘తాను ఆ పుస్తకాన్ని నాలుగుసార్లు చదివాననీ, ఇప్పుడు ఐదోసారి చదువుతున్నాననీ, ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందని’ సగర్వంగా ప్రకటించారు సంజీవయ్య. ‘‘ఇతడు దళితుడు కనుక నిత్యం వాళ్లనే ఆదరిస్తాడు అని ఇతరులు అనుకుంటారనే భయం నాకు పూర్వం ఉండేది. ఈ పుస్తకం చదివిన తరువాత ఆ భయం పోయింది. నేను కాకపోతే, మరెవరు వాళ్లను గురించి తపన పడుతారు అన్న దృక్పథం ఏర్పడింది’’ అని బహిరంగంగా ప్రకటించడంలో భీమన్న రచనలు సామాజికంగా చెరగని ముద్రవేశాయి అనడంలో అతిశయోక్తి లేదు. కవిగా భీమన్న సామాన్యుని ఆవేదనను తన రచనల్లో ప్రతిబింబింపజేశారు.

రెండో పెళ్లి

సంజీవయ్య వివాహం చేసుకున్న తొలి రోజుల్లో మాజీ మంత్రి వేముల కూర్మయ్య ఇంట్లో విందు భోజనం చేశారు. భీమన్న, సంజీవయ్య వెంటే ఉన్న సందర్భంగా సరదాగా కబుర్లు చెబుతూ, భీమన్నవైపు చిలిపిగా చూస్తూ, ‘ఇది నాకు రెండో పెళ్లి’ అన్నాడు. సంజీవయ్య భార్య కృష్ణవేణి, ఆమెతల్లి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఆందోళనకు గురయ్యారట. కాసేపు వాళ్లని కంగారు  పడనిచ్చి, ‘నా మొదటావిడ మధుబాల’ అన్నాడట సంజీవయ్య నిమ్మళంగా. ‘మధుబాల భీమన్న కావ్య కానుక’ అని చెప్పటంతో అందరూ ఆనందంగా నవ్వుకున్నారట.

అన్నాతమ్ముడు

సంజీవయ్య, భీమన్నల మధ్య ఉన్న ఆత్మీయత అరుదైనది. నాటి సాహిత్య వనంలో వెల్లి విరిసిన సాహితీపరులు సంజీవయ్య, భీమన్నలు. సంజీవయ్య పెద్దన్నయ్య, భీమన్న చిన్న తమ్ముడు. రామ లక్ష్మణుల సాదృశ్యంగా సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి పద్యాలు, గేయాలు, కథలు, నాటికలు వేదికగా, కలిసి కట్టుగా సభ్య సమాజాన్ని జాగృతి పరిచిన మహనీయులు. ఈ దిశగా వారివురు చేసిన కృషి అనన్యం, అసామాన్యం. -దాసరి శ్రీనివాసులు, రిటైర్డు ఐఏఎస్ అధికారి