
- ఎన్సీడీ సర్వేలో వెల్లడి
- జిల్లాలో 1,23,935 మంది పేషెంట్లు
- మారుతున్న జీవనశైలే కారణం
సిద్దిపేట, వెలుగు: జిల్లాలో బీపీ, షుగర్ పేషెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమం (నేషనల్నాన్కమ్యూనికేబుల్డీసీజ్మానిటరింగ్) సర్వేలో ఈ విషయం బయటపడింది. గతేడాదితో పోలిస్తే 30 ఏళ్లు పైబడి బీపీ, షుగర్ బారినపడిన వారి సంఖ్య పెరిగింది. కొత్తగా 3 వేల మంది షుగర్, బీపీ బారిన పడ్డారు. సిద్దిపేట జిల్లా మొత్తం 10,12,065 మంది జనాభాలో పురుషులు5,04,141, మహిళలు 5,07,924 మంది ఉన్నారు. వీరిలో 30 సంవత్సరాలు పైబడిన పురుషులు 2,98,272, మహిళలు 3,15,125 మొత్తం 6,13,397 మందికి బీపీ, షుగర్, ఇతర పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,23,935 మంది బీపీ, షుగర్ తో పాటు క్యాన్సర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు గుర్తించారు.
గతేడాదితో పోలిస్తే జిల్లాలో బీపీ, షుగర్ వ్యాధిన పడ్డ వారి సంఖ్య పెరుగుతోంది. గతేడాది 82,367 మంది బీపీ పేషంట్లుంటే వారి సంఖ్య ఈ ఏడాది 86,590 మందికి చేరింది. షుగర్ పేషంట్ల విషయంలో గతేడాది 34,907 మంది ఉంటే ఈ ఏడాది 36,809కి పెరిగింది. ఏడాది కాలంలో జిల్లాలో బీపీ పేషంట్లు 4223, షుగర్ పేషంట్లు 1902 మంది పెరిగారు.
బీపీ పేషంట్లే అధికం
ఎన్సీడీ సర్వేలో జిల్లాలో బీపీ పేషెంట్లు అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. జిల్లాలో మొత్తం 86,590 మంది బీపీ పేషెంట్లుంటే వారిలో పురుషులు 39,333, మహిళలు 47,257 మంది ఉన్నారు. జిల్లాలో బీపీ పేషెంట్ల సంఖ్యతో పోలిస్తే షుగర్ పేషెంట్ల సంఖ్య సగం కంటే తక్కువగా ఉంది. బీపీ పేషెంట్లలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంటి పనుల ఒత్తిడితో పాటు ఇతర కారణాల వల్ల బీపీ బారిన పడుతున్న మహిళల సంఖ్య పెరిగిందని డాక్టర్లు భావిస్తున్నారు.
క్యాన్సర్ పేషెంట్లు 536
జిల్లాలో మొత్తం 536 మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నట్టు ఎన్సీడీ ప్రోగ్రామ్ లో గుర్తించారు. వీరిలో 79 మంది బ్రెస్ట్ క్యాన్సర్, 135 మంది సర్వికల్ క్యాన్సర్, 51 మంది లంగ్ క్యాన్సర్, 76 మంది ఓరల్ క్యాన్సర్, 185 మంది ఇతర క్యాన్సర్ వ్యాధులతో పాటు బాధపడుతున్నారు. వీరిలో ఒకటి కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు. ఆర్థికంగా స్థితి మంతులైన వారు హైదరాబాద్ నగరాల్లో చికిత్సలు చేయించుకుంటుంటే పేదలు మాత్రం గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. బీపీ, షుగర్ వ్యాధులకు స్థానికంగా పీహెచ్సీ లు, సీహెచ్సీలలో మందులు తీసుకుంటున్నారు.
జీవనశైలి అధ్వానం
మారిన జీవనశైలి కారణంగానే బీపీ, షుగర్ బారిన పడ్డ వారి సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. జీవనశైలిలో క్రమశిక్షణ లోపించడం శారీరక వ్యాయామానికి దూరంగా ఉండడంతో పాటు జంక్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వ్యాధుల బారిన పడడానికి కారణమవుతోంది. ప్రతి రోజు ఆరగంట పాటు వాకింగ్, ఎక్సర్ సైజ్ లు చేస్తూ మితాహారాన్ని తీసుకుంటే చాలా వరకు రోగాల బారిన పడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.